ఐపీఎల్‌ ఫైనల్‌‌: సీఎస్‌కే టార్గెట్‌ 150

12 May, 2019 21:35 IST|Sakshi

హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌-12లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన ముంబైకి ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. ఇన్నింగ్స్‌ ధాటిగా ఆరంభించిన రోహిత్‌, డీకాక్‌లు చెన్నై బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. అయితే ఇన్నింగ్స్‌ సాఫీగా సాగుతున్న సమయంలో వరుస ఓవర్లలో డీకాక్‌(29), రోహిత్‌(15)లు ఔటయ్యారు. అనంతరం వచ్చిన సూర్యకుమార్‌(15), కృనాల్‌(7)లు తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో 89 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ తరుణంలో క్రీజులో నిలదొక్కుకపోయిన ఇషాన్‌ కిషన్‌(23)కూడా ఔటయ్యాడు. దీంతో ముంబైని ఆదుకునే బాధ్యత పొలార్డ్‌, హార్దిక్‌లు తీసుకున్నారు. 

పోలార్డ్‌ మెరుపులు
కీలక మ్యాచ్‌లో కీరన్‌ పొలార్డ్‌ రాణించాడు. సీఎస్‌కే ముందు భారీ స్కోర్‌ ఉంచాలాంటే తప్పకుండా ఆడాల్సిన సమయంలో పొలార్డ్‌ తన వంతు బాధ్యత నిర్వర్తించాడు. అయితే హార్దిక్‌కు పక్కా స్కెచ్‌ వేసిన ధోని.. అతడు పరుగులు చేయకుండా అడ్డుకున్నాడు. ఈ క్రమంలో హార్దిక్‌(16)ను దీపక్‌ చహర్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అయితే పొలార్డ్‌(41 నాటౌట్‌; 25 బంతుల్లో; 3ఫోర్లు, 3 సిక్సర్లు)లు మెరుపులు మెరిపించడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. సీఎస్‌కే బౌలర్లలో దీపక్‌ చహర్‌ మూడు వికెట్లు తీయగా.. శార్దూల్‌, తాహీర్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ముంబైని చివరి ఓవర్లలో కట్టడిచేయడంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ధోని ఒకింత సక్సెస్‌ అయ్యారు.
 

మరిన్ని వార్తలు