ధోని( vs) కోహ్లి

20 Feb, 2019 01:28 IST|Sakshi

మార్చి 23న చెన్నై, బెంగళూరు మధ్య తొలి పోరు

ఐపీఎల్‌–12 షెడ్యూల్‌ విడుదల

ప్రస్తుతానికి రెండు వారాల వ్యవధికి ప్రకటన

సాధారణ ఎన్నికల  తేదీలను బట్టి మార్పులు

29వ తేదీన హైదరాబాద్‌లో మ్యాచ్‌

న్యూఢిల్లీ: జనరంజక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 12వ సీజన్‌ మార్చి 23 నుంచి ప్రారంభం కానుంది. బీసీసీఐ ఈ మేరకు రెండు వారాల (మార్చి 23– ఏప్రిల్‌ 5) షెడ్యూల్‌ను ప్రకటించింది. 8 వేదికల్లో 17 మ్యాచ్‌లు జరుగుతాయి. దీనిప్రకారం తొలి మ్యాచ్‌లో మహేంద్ర సింగ్‌ ధోని నేతృత్వంలోని డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ను విరాట్‌ కోహ్లి సారథ్యంలోని బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ ఢీ కొంటుంది. సంప్రదాయం ప్రకారం  గత ఏడాది విజేత సొంతగడ్డ అయిన చెన్నైలో ఈ మ్యాచ్‌ జరుగనుంది. 

ఎన్నికల తేదీల ఆధారంగా... 
ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు ఉండటంతో లీగ్‌కు 15 రోజుల ముందే తెరలేస్తోంది. మరోవైపు త్వరలో వెలువడనున్న ఎన్నికల షెడ్యూల్‌ ఆధారంగా... ఇప్పుడు ప్రకటించిన మ్యాచ్‌ల ప్రణాళికల్లో మార్పులు ఉంటాయని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ‘ఎన్నికల షెడ్యూల్‌ వెలువడ్డాక పరిస్థితిని బోర్డు సమీక్షిస్తుంది. పోలింగ్‌ తేదీల ఆధారంగా స్థానిక సంఘాలను సమన్వయం చేసుకుంటూ లీగ్‌  షెడ్యూల్‌పై చర్చిస్తుంది’ అని ఆయన తెలిపారు. 

మూడు రోజులు రెండేసి మ్యాచ్‌లు 
మార్చి 24, 30, 31 తేదీల్లో రెండేసి మ్యాచ్‌లు జరుగుతాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌ (3 సొంతగడ్డపై), రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (3 ప్రత్యర్థి వేదికలపై) ఐదేసి మ్యాచ్‌లు ఆడనుండగా, మిగతా జట్లు నాలుగు మ్యాచ్‌లు (రెండు సొంతగడ్డపై, రెండు ప్రత్యర్థి వేదిలకపై) ఆడతాయి. రెండు మ్యాచ్‌లు ఉన్న తేదీల్లో ఏ మ్యాచ్‌ ఏ సమయానికి ప్రారంభం అవుతుందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. గతంలో తొలి మ్యాచ్‌ సాయంత్రం 4 గంటలకు, రెండో మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు మొదలయ్యేవి. బీసీసీఐ ఈసారీ ఇదే పద్ధతి అనుసరిస్తుందా? లేక మార్పేమైనా చేస్తుందా? చూడాలి. 

హైదరాబాద్‌ తొలి మ్యాచ్‌ 24న... 
గతేడాది రన్నరప్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఈసారి తమ తొలి మ్యాచ్‌ను మార్చి 24న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆడతుంది. సొంత నగరం హైదరాబాద్‌లో 29వ తేదీన రాజస్తాన్‌ రాయల్స్‌తో, 31న బెంగళూరుతో తలపడుతుంది.   

మరిన్ని వార్తలు