కేకేఆర్‌ పరుగుల సునామీ..

27 Mar, 2019 21:53 IST|Sakshi

కింగ్స్‌ పంజాబ్‌ టార్గెట్‌ 219

అర్ధసెంచరీలతో రాణించిన ఊతప్ప, రాణా

విధ్వంసం సృష్టించిన రసెల్‌

కోల్‌కతా: విధ్వంసకర బ్యాటింగ్‌ అంటే ఏంటో కింగ్స్‌ పంజాబ్‌కు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బ్యాట్స్‌మెన్‌ చూపించారు. బౌండరీల ఖాతాను నరైన్‌ మొదలెట్టగా.. ఊతప్ప ముగించాడు. మధ్యలో నితీష్‌ రాణా, ఆండ్రీ రసెల్‌ పరుగుల సునామీ సృష్టించడంతో కేకేఆర్‌ భారీ స్కోర్‌ నమోదు చేసింది. కేకేఆర్‌ బ్యాట్స్‌మెన్‌ దాటికి బంతులెక్కడ వేయాలో పంజాబ్‌ బౌలర్లకు పాలుపోలేదు.  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 219 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రాబిన్‌ ఊతప్ప(67 నాటౌట్‌; 50 బంతుల్లో 6ఫోర్లు, 2 సిక్సర్లు), నితీష్‌ రాణా(63; 34 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు)లు అర్దసెంచరీలతో రాణించగా.. చివర్లో రసెల్‌(48; 17 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) ఉప్పెనలా విజృంభించాడు. 

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన కేకేఆర్‌కు శుభారంభం లభించలేదు. క్రిస్‌ లిన్‌(10) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. మరో ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌(24) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించినా.. భారీ స్కోర్‌ చేయలేకపోయాడు. దీంతో 36 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో రాబిన్‌ ఊతప్ప, నితీష్‌ రాణాలు ఆచితూచి ఆడారు. క్రీజులో నిలదొక్కుకున్న అనంతరం గేర్‌ మార్చి దాటిగా ఆడటం ప్రారంభించారు. ముఖ్యంగా రాణా అశ్విన్‌ బౌలింగ్‌ను టార్గెట్‌ చేస్తూ బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో ఈ సీజన్‌లో రెండో అర్దసెంచరీ సాధించాడు. అనంతరం భారీ షాట్‌కు యత్నించి రాణా ఔటవుతాడు.

భారీ మూల్యం చెల్లించుకున్నారు
రసెల్‌ మూడు పరుగుల వ్యక్తి గత స్కోర్‌ వద్ద షమీ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. అయితే ఆ బంతి నోబాల్‌ కావడంతో.. పంజాబ్‌ భారీ మూల్యం చెల్లించుకుంది. ఆతర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగడంతో పంజాబ్‌ బౌలర్లు నేలచూపులు చూశారు. బౌలర్‌ ఎవరు.. ఏబంతి వేశాడనేది చూడకుండా బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా రసెల్‌ ఆడాడు. దీంతో కేకేఆర్‌ స్కోర్‌ బోర్డు పరుగులు పెట్టింది. చివరి ఓవర్‌లో భారీ షాట్‌కు యత్నించి క్యాచ్‌ ఔటయ్యాడు. లేకుంటే తన ఖాతాలో హాఫ్‌ సెంచరీ.. స్కోర్‌ బోర్డుపై మరో పది పరుగులు ఉండేవి. దీంతో కేకేఆర్‌ ఆటగాళ్ల వీరవిహారంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది.  
 

>
మరిన్ని వార్తలు