కోల్‌కతా... లిన్‌ గిల్‌గింత

3 May, 2019 23:46 IST|Sakshi

మెరిసిన నైట్‌రైడర్స్‌ ఓపెనర్లు 

కీలక మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవెన్‌పై గెలుపు 

ప్లే ఆఫ్‌ అవకాశాలు సజీవం 

స్యామ్‌ కరన్‌ శ్రమ వృథా

పంజాబ్‌ ఖేల్‌ ఖతం

లీగ్‌లో ఎనిమిదో ఓటమితో ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ దాదాపు బయటికెళ్లిపోయింది. ఇదే సమయంలో ఆరో గెలుపుతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తదుపరి దశ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఒకింత పెద్దదైన లక్ష్యం కళ్ల ముందున్నా... ఎక్కడా తగ్గకుండా ఆడిన కోల్‌కతా మ్యాచ్‌ను ఏకపక్షంగా వశం చేసుకుంది. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్‌మెన్‌  తమ వంతుగా, దూకుడుగా ఆడటంతో ఆ జట్టుకు లక్ష్య ఛేదనలో ఇబ్బందే లేకపోయింది.   

మొహాలీ: ఐపీఎల్‌–12లో పడుతూ లేస్తూ సాగిన పంజాబ్‌ ప్రయాణం ప్లే ఆఫ్స్‌ చేరకుండానే ముగిసింది! ఈ దిశగా ఏ మూలనో మిణుకుమిణుకుమంటున్న ఆ జట్టు ఆశలను వారి సొంతగడ్డ పైనే కోల్‌కతా ఆవిరి చేసింది. రెండు జట్ల మధ్య శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి... ప్లే ఆఫ్‌ అవకాశాలను నిలబెట్టుకుంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆల్‌ రౌండర్‌ స్యామ్‌ కరన్‌ (24 బంతుల్లో 55 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), వికెట్‌ కీపర్‌ నికోలస్‌ పూరన్‌ (27 బంతుల్లో 48; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడు కనబర్చారు. సందీప్‌ వారియర్‌ (2/31) రెండు వికెట్లు పడగొట్టాడు. యువ ఓపెనర్, ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శుబ్‌మన్‌ గిల్‌ (49 బంతుల్లో 65 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీ... మరో ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌ (22 బంతుల్లో 46; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఫటాఫట్‌ ఇన్నింగ్స్‌తో లక్ష్యాన్ని కోల్‌కతా 18 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. 

పూరన్‌ దూకుడు... కరన్‌ దంచుడు 
సందీప్‌ వారియర్‌ వేసిన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు సహా 10 పరుగులు వచ్చినా తర్వాత పంజాబ్‌ ఇన్నింగ్స్‌ వేగంగా సాగలేదు. ఇబ్బందిగా కనిపించిన ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (2)ను స్లో బంతితో, గేల్‌ (14)ను షార్ట్‌ బాల్‌తో సందీప్‌ బోల్తా కొట్టించాడు. పవర్‌ ప్లే పూర్తయ్యేసరికి జట్టు 41/2తో నిలిచింది. వస్తూనే బౌండరీతో ఖాతా తెరిచిన మయాంక్‌ (26 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్‌) సమయోచితంగా ఆడుతుండగా, పూరన్‌ విజృంభించాడు. గర్నీ బౌలింగ్‌లో సిక్స్‌.. రసెల్, చావ్లా ఓవర్లలో రెండేసి సిక్స్‌లు, ఫోర్లు దంచాడు. 40 బంతుల్లో 69 పరుగులతో మంచి రన్‌రేట్‌తో దూకుడు మీదున్న ఈ జోడీని నితీశ్‌ రాణా విడదీశాడు. చావ్లాను లక్ష్యంగా చేసుకున్న పూరన్‌ను నిలువరించేందుకు రాణాను రంగంలోకి దించడం ఫలితాన్నిచ్చింది. అతడి బౌలింగ్‌లో భారీ షాట్‌ కొట్టబోయిన పూరన్‌ మిడ్‌ వికెట్‌లో సందీప్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. కాసేపటికే మయాంక్‌... రింకూ సింగ్‌ చురుకైన ఫీల్డింగ్‌కు రనౌటయ్యాడు. ఆరంభం నుంచి ఊపు కనబర్చిన కరన్‌కు మన్‌దీప్‌ సింగ్‌ (17 బంతుల్లో 25; ఫోర్, సిక్స్‌) తోడయ్యాడు. వీరు ఐదో వికెట్‌కు 24 బంతుల్లోనే 38 పరుగులు జోడించి స్కోరు పడిపోకుండా చూశారు. 151/6...! 19వ ఓవర్‌ తొలి బంతికి అశ్విన్‌ (0) ఔటయ్యేటప్పటికి పంజాబ్‌ స్కోరిది. కరన్‌ క్రీజులో ఉన్నా గర్నీ, రసెల్‌ కట్టుదిట్టంగా బంతులేస్తుండటంతో పంజాబ్‌ సాధారణ స్కోరే చేసేలా కనిపించింది. కానీ, కరన్‌ కథ మార్చాడు. ఇన్నింగ్స్‌ చివరి 11 బంతుల్లో 9 బంతులను ఎదుర్కొన్న అతడు ఏకంగా 31 పరుగులు సాధించాడు. ఇందులో 5 ఫోర్లు, ఒక సిక్స్‌ ఉండటం విశేషం.
  
తలా కొంత దంచేశారు... 
ఛేదనలో కోల్‌కతా ఇన్నింగ్స్‌ ఎక్కడా వేగం తగ్గలేదు. ఓపెనర్లలో శుబ్‌మన్‌ సంయమనం చూపగా, లిన్‌ మొదటి నుంచే ధాటిగా ఆడుతూ పంజాబ్‌కు వణుకు పుట్టించాడు. అర్షదీప్‌ ఓవర్లో హ్యాట్రిక్‌ బౌండరీలు, అశ్విన్‌ బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాదాడు. ఆండ్రూ టై ఓవర్లో వరుసగా 6, 4 కొట్టాడు. మరుసటి బంతికి భారీ షాట్‌ ఆడబోయి టైకే క్యాచ్‌ ఇచ్చాడు. పవర్‌ ప్లే అనంతరం నైట్‌ రైడర్స్‌ 62/1తో నిలిచింది. ఉతప్ప (14 బంతుల్లో 22; 2 ఫోర్లు, సిక్స్‌) ఔటయ్యాక గిల్‌ జూలు విదిల్చాడు. అప్పటివరకు బంతికో పరుగు చొప్పున చేస్తున్న అతడు... అశ్విన్‌ వేసిన 13వ ఓవర్లో విరుచుకుపడి రెండు సిక్స్‌లు, ఫోర్‌ కొట్టాడు. 48 బంతుల్లో 74 పరుగులుగా ఉన్న విజయ సమీకరణం దీంతో ఒక్కసారిగా 42 బంతుల్లో 54 పరుగులుగా మారిపోయింది. 36 బంతుల్లోనే గిల్‌ అర్ధ సెంచరీ పూర్తయింది. అనంతరం టై బౌలింగ్‌లో రసెల్‌ (14 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండు సిక్స్‌లు బాదడంతో లక్ష్యం మరింత తేలికైంది. కరన్‌ ఓవర్లో కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (9 బంతుల్లో 21 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) తనదైన శైలిలో షాట్లు కొట్టి అనుకున్నదానికంటే ముందే మ్యాచ్‌ను ముగించాడు. కీలకమైన మ్యాచ్‌లో అదీ సొంతగడ్డపై బౌలింగ్‌ తేలిపోవడం పంజాబ్‌ను దెబ్బతీసింది. 

హైదరాబాద్, కోల్‌కతా మధ్యలో రాజస్తాన్‌  
ప్లే ఆఫ్‌ ముంగిట పాయింట్ల పరంగా (13 మ్యాచ్‌ల్లో 12) ప్రస్తుతం సన్‌రైజర్స్‌ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సమంగా ఉన్నాయి. అయితే, రన్‌రేట్‌లో హైదరాబాద్‌ చాలా మెరుగ్గా ఉంది. శనివారం బెంగళూరుపై గెలిస్తే సన్‌రైజర్స్‌ 14 పాయింట్లతో ఉంటుంది. దీంతో ఆదివారం ముంబైతో మ్యాచ్‌లో కోల్‌కతా రన్‌రేట్‌ లెక్కలను చూసుకుంటూ నెగ్గాల్సి వస్తుంది. బహుశా పరుగుల్లో భారీ తేడాతోనో, లక్ష్యాన్ని చాలా ముందుగానో ఛేదించాల్సి రావొచ్చు. హైదరాబాద్‌ ఓడితే మాత్రం... కోల్‌కతాకు ఫ్లే ఆఫ్‌ బెర్త్‌ దక్కాలంటే ముంబైపై గెలిస్తే సరిపోతుంది. ఒకవేళ... హైదరాబాద్, కోల్‌కతా తమ మ్యాచ్‌ల్లో ఓడిపోయి, ఢిల్లీపై రాజస్తాన్‌ నెగ్గితే ఆ జట్టు   13 పాయింట్లతో ప్లే ఆఫ్‌ బెర్త్‌ను సంపాదిస్తుంది.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు