రసెల్‌ను రాజస్తాన్‌ కట్టడి చేసేనా?

7 Apr, 2019 19:52 IST|Sakshi

జైపూర్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌లో భాగంగా స్థానిక సవాయ్‌ మాన్‌సింగ్‌ మైదానంలో రాజస్తాన్‌ రాయల్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కేకేఆర్‌ సారథి దినేశ్‌ కార్తీక్‌ తొలుత బౌలింగ్‌కే మొగ్గుచూపాడు. గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో సంజూ శాంసన్‌ ఈ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. ఇక గత మ్యాచ్‌లో అంతగా ఆకట్టుకోని స్టువార్టు బిన్ని, వరుణ్‌ ఆరోన్‌లను తప్పించిన రాజస్తాన్‌ రాయల్స్‌.. ప్రశాంత్‌ చోప్రా, మిధున్‌లను తుది జట్టులోకి తీసుకుంది. ఇక కేకేఆర్‌ కూడా ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. ఫెర్గుసన్‌ను పక్కకు పెట్టి మరో పేసర్‌ హరే గుర్నేకు అవాకశం కల్పించింది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది.   

ఇక ఇప్పటివరకు ఆడిన నాలుగింటిలో మూడు మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో కేకేఆర్‌ మూడో స్థానంలో ఉంది. రాజస్తాన్‌ రాయల్స్‌ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచే గెలిచి చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. సొంత మైదానంలో పర్యాటకు జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా గెలవాలని రహానే సేన ఆరాటపడుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానానికి వెళ్లాలని కేకేఆర్‌ భావిస్తోంది. రెండు జట్లు బలబలాల విషయంలో సమానంగా ఉన్నా.. సమష్టి కృషితో కేకేఆర్‌ వరుస విజయాలు సాధిస్తోంది. కేకేఆర్‌ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న రసెల్‌ను కట్టడి చేస్తే విజయం సాధించవచ్చని రాజస్తాన్‌ భావిస్తోంది.

తుది జట్లు:
రాజస్తాన్‌: అజింక్యా రహానే(కెప్టెన్‌), బట్లర్‌, స్టీవ్‌ స్మిత్‌, రాహుల్‌ త్రిపాఠి, బెన్‌ స్టోక్స్‌, ప్రశాంత్‌ చోప్రా, క్రిష్ణప్ప గౌతమ్‌, జోఫ్రా ఆర్చర్‌, శ్రేయాస్‌ గోపాల్‌, ధావల్‌ కులకర్ణి, మిదున్‌

కేకేఆర్‌: దినేశ్‌ కార్తీక్‌(కెప్టెన్‌), క్రిస్‌ లిన్‌, సునీల్‌ నరైన్‌, రాబిన్‌ ఊతప్ప, నితీష్‌ రాణా, శుభ్‌మన్‌ గిల్‌, ఆండ్రీ రసెల్‌, పియూష్‌ చావ్లా, కుల్దీప్‌ యాదవ్‌, ప్రసీద్‌ కృష్ణ, హరే గుర్నే
 

మరిన్ని వార్తలు