రసెల్‌ బ్యాటింగ్‌ వీక్‌నెస్‌ అదే!

11 Apr, 2019 18:52 IST|Sakshi

హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌ 12లో ఇప్పటివరకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సాధించిన విజయాల్లో విధ్వంసకర ఆటగాడు ఆండ్రీ రసెల్‌ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ప్రత్యర్థి బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన రసెల్‌ బ్యాటింగ్‌ బలహీనతలను ఆ జట్టు ఆటగాడే కుల్దీప్‌ యాదవ్‌ తెలిపాడు. బంతిని ఎక్కువగా స్సిన్‌ చేస్తే రసెల్‌ ఆడలేడని పేర్కొన్నాడు. ఒకవేళ అతడిని ఎదుర్కోవాల్సి వస్తే బంతిని ఎక్కువగా టర్న్‌ చేసి అతడిని కట్టడి చేస్తానని వివరించాడు. అయితే సరైన రీతిలో యార్కర్లు వేస్తే రసెల్‌ ఇబ్బందులకు గురవుతాడని మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.

ఇక ఈ ఐపీఎల్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న రసెల్‌..  ఇప్పటివరకు 212.39 స్ట్రైక్‌ రేట్‌తో 257 పరుగులు సాధించాడు. రసెల్‌తో పాటు మిగతా ఆటగాళ్లు సరైన సమయంలో రాణిస్తుండటంతో కేకేఆర్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌తో ఓడిపోయిన కార్తీక్‌ సేన.. సీఎస్‌కేపై మాత్రమ తేలిపోయింది. ఆ మ్యాచ్‌లో తమ బలహీనతలను కేకేఆర్‌ ఆటగాళ్లు బయటపెట్టుకున్నారు. కేకేఆర్‌ తన తరువాతి మ్యాచ్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌తో రేపు(శుక్రవారం) తలపడనుంది. 

మరిన్ని వార్తలు