ముంబై... చలో హైదరాబాద్‌

7 May, 2019 23:19 IST|Sakshi

ఐదోసారి ఐపీఎల్‌ ఫైనల్లోకి ముంబై ఇండియన్స్‌  

చెన్నైపై మళ్లీ నెగ్గిన రోహిత్‌ సేన 

తొలి క్వాలిఫయర్‌లో సూపర్‌ కింగ్స్‌ చిత్తు  

ఆరు వికెట్లతో ఓడిన ధోని బృందం  

మాజీ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌లో మళ్లీ తన స్థాయిని, సత్తాను ప్రదర్శించింది. మూడు సార్లు విజేతగా నిలిచిన ఈ జట్టు ఐదోసారి ఫైనల్‌ పోరుకు అర్హత సాధించింది. సీజన్‌లో రెండు లీగ్‌ మ్యాచ్‌లలో కూడా డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నైపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన రోహిత్‌ సేన ప్రత్యర్థి కోట చెపాక్‌లో మళ్లీ అదే జోరు చూపించి మూడో విజయాన్ని నమోదు చేసింది. కీలకమైన తొలి క్వాలిఫయర్‌లో చక్కటి ప్రదర్శనతో ధోని బృందాన్ని కట్టడి చేసి మూడేళ్లలో రెండోసారి హైదరాబాద్‌ వేదికగా ఫైనల్‌ ఆడేందుకు సన్నద్ధమైంది. ముందుగా ముంబై స్పిన్నర్ల దెబ్బకు పరుగులు తీయడంలో తీవ్రంగా ఇబ్బంది పడిన చెన్నై... ఆ తర్వాత అదే స్పిన్‌తో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో విఫలమైంది. కీలకదశలో క్యాచ్‌లు వదిలేసి మూల్యం చెల్లించుకుంది. సాధారణ లక్ష్య ఛేదనలో సూర్యకుమార్‌ సమయోచిత అర్ధ సెంచరీ ముంబైని గెలిపించింది. ఇక తుది పోరుకు చేరేందుకు చెన్నైకి రెండో క్వాలిఫయర్‌ రూపంలో శుక్రవారం మరో అవకాశం ముందుంది.   

చెన్నై: ఐపీఎల్‌–12 లీగ్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్‌ అదే ఆటను ప్లే ఆఫ్స్‌లోనూ కొనసాగించింది. సమష్టి ఆటతో మరోసారి లీగ్‌లో ఫైనల్‌కు చేరింది. మంగళవారం ఇక్కడ జరిగిన తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ముంబై 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను చిత్తు చేసింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. అంబటి రాయుడు (37 బంతుల్లో 42 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), ధోని (29 బంతుల్లో 37 నాటౌట్‌; 3 సిక్సర్లు) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. రాహుల్‌ చహర్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ముంబై 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 132 పరుగులు చేసి గెలిచింది. సూర్యకుమార్‌ (54 బంతుల్లో 71 నాటౌట్‌; 10 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా, ఇషాన్‌ కిషన్‌ (31 బంతుల్లో 28; 1 ఫోర్, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. మూడో వికెట్‌కు వీరిద్దరు 63 బంతుల్లో జోడించిన 80 పరుగులే ముంబై విజయానికి బాటలు వేశాయి.  

కీలక భాగస్వామ్యం... 
పవర్‌ప్లే ముగిసేసరికే ముగ్గురు బ్యాట్స్‌మన్‌ ఔట్‌... మ్యాచ్‌లో చెన్నై బ్యాటింగ్‌ పరిస్థితి ఇది. అయితే రాయుడు, ధోని భాగస్వామ్యం జట్టుకు చెప్పుకోదగ్గ స్కోరు అందించింది. సీజన్‌లో కేవలం రెండో మ్యాచ్‌ ఆడిన మురళీ విజయ్‌ (26 బంతుల్లో 26; 3 ఫోర్లు) కూడా కొంత వరకు తన పాత్ర పోషించాడు. నెమ్మదైన పిచ్‌పై బ్యాటింగ్‌కు దిగిన చెన్నైని ప్రత్యర్థి స్పిన్నర్లు కట్టడి చేశారు. రాహుల్‌ చహర్‌ తన తొలి బంతికే డు ప్లెసిస్‌ (6)ను ఔట్‌ చేయగా, రైనా (5) మరో స్పిన్నర్‌ జయంత్‌కు రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చాడు. బుమ్రా ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి జోరు పెంచే ప్రయత్నం చేసిన వాట్సన్‌ (10)ను కృనాల్‌ వెనక్కి పంపించాడు. ఆరు ఓవర్ల తర్వాత స్కోరు 32/3 కాగా, జట్టును ఆదుకునేందుకు విజయ్, రాయుడు ప్రయత్నించారు. అయితే ఈ భాగస్వామ్యం కూడా ఎక్కువ సేపు సాగలేదు. వీరిద్దరు 38 బంతుల్లో 33 పరుగులు జోడించిన తర్వాత రాహుల్‌ చహర్‌ టర్నింగ్‌ బంతిని ఆడలేక విజయ్‌ స్టంపౌటయ్యాడు. అనంతరం రాయుడు, ధోని ఇన్నింగ్స్‌ బాధ్యతను భుజాన వేసుకున్నారు. జయంత్‌ వేసిన 14వ ఓవర్లో ఇద్దరూ చెరో సిక్స్‌ కొట్టగా... మలింగ ఓవర్లో ధోని వరుసగా కొట్టిన రెండు భారీ సిక్సర్లకు స్టేడియం హోరెత్తింది. అయితే బుమ్రా చివరి ఓవర్లో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో మరిన్ని మెరుపులకు అవకాశం లేకుండా పోయింది. ధోని, రాయుడు ఐదో వికెట్‌కు అభేద్యంగా 66 పరుగులు జత చేశారు.  

సూర్యకుమార్‌ అర్ధ సెంచరీ... 
ముంబైకి కూడా సరైన ఆరంభం లభించలేదు. రెండో బంతికే రోహిత్‌ (4)ను ఔట్‌ చేసి దీపక్‌ చహర్‌ చెన్నైకి శుభారంభం అందించాడు. డి కాక్‌ (8)ను హర్భజన్‌ వెనక్కి పంపించాడు. ఈ దశలో సూర్యకుమార్, ఇషాన్‌ కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రశాంతంగా ఆడుతూ పరుగులు సాధించారు. 37 బంతుల్లో సూర్యకుమార్‌ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎట్టకేలకు ఇషాన్‌ను బౌల్డ్‌ చేసి తాహిర్‌ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. తర్వాతి బంతికే కృనాల్‌ పాండ్యా (0)ను కూడా తాహిర్‌ ఔట్‌ చేయగా... జడేజా వేసిన మరుసటి బంతికి స్లిప్‌లో సూర్యకుమార్‌ ఇచ్చిన క్యాచ్‌ను వాట్సన్‌ వదిలేయడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే సూర్యకుమార్, హార్దిక్‌ (13 నాటౌట్‌) కలిసి 9 బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించారు.   

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు