రాజస్తాన్‌ మళ్లీ ఓడిపోయింది..

16 Apr, 2019 23:53 IST|Sakshi

మొహాలి: ముంబై ఇండియన్స్‌పై గెలుపుతో టచ్‌లోకి వచ్చినట్టు కనిపించిన రాజస్తాన్‌ రాయల్స్‌..  కింగ్స్‌ పంజాబ్‌ చేతిలో ఓడిపోయింది. ఐపీఎల్‌లో భాగంగా స్థానిక ఐఎస్‌ బింద్రా మైదానంలో కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. పంజాబ్‌ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 170 పరుగులకే పరిమితమైంది. దీంతో ఈ సీజన్‌లో రాజస్తాన్‌కు ఇది ఆరో ఓటమి కాగ, పంజాబ్‌కు ఐదో విజయం. ఛేదనలో రాహుల్‌ త్రిపాఠి(50) మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. బట్లర్‌(23), శాంసన్‌(27), రహానే(26)లు ఓ మోస్తారుగా రాణించినప్పటికీ విజయానికి కావాల్సిన పరుగులను రాబట్టలేకపోయారు. పంజాబ్‌ బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, షమీలు తలో రెండో వికెట్లు పడగొట్టారు.  

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన కింగ్స్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌ను కేఎల్‌ రాహుల్‌-క్రిస్‌ గేల్‌లు ఆరంభించారు. అయితే క్రిస్‌ గేల్‌(30; 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడే క్రమంలో తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. అనంతరం రాహుల్‌తో కలిసిన మయాంక్‌ అగర్వాల్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. మయాంక్‌ అగర్వాల్‌(26; 12 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లు) భారీ షాట్‌కు యత్నించి రెండో వికెట్‌గా ఔటయ్యాడు.

ఆ తరుణంలో రాహుల్‌-డేవిడ్‌ మిల్లర్‌లు సమయోచితంగా బ్యాటింగ్‌ చేయడంతో కింగ్స్‌ పంజాబ్‌ తేరుకుంది. వీరిద్దరూ 85 పరుగులు భాగస్వామ్యాన్ని జత చేశారు. ఈ క‍్రమంలోనే రాహుల్‌(52; 47 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీ చేసిన తర్వాత పెవిలియన్‌ చేరగా, నికోలస్‌ పురాన్‌(5) నిరాశపరిచాడు. ఇక డేవిడ్‌ మిల్లర్‌(40) మెరవగా, రవిచంద్రన్ అశ్విన్‌ ‌( 17 నాటౌట్‌; 4 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లు) చివరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టడంతో కింగ్స్‌ పంజాబ్‌ ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.

మరిన్ని వార్తలు