ఆర్సీబీ ఖాతా తెరిచేనా?

13 Apr, 2019 20:00 IST|Sakshi

మొహాలీ: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు పరాజయాలతో పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉన్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు నేడు కింగ్స్‌ పంజాబ్‌తో తలపడుతోంది. ఐపీఎల్‌లో భాగంగా స్థానిక ఐఎస్‌ బింద్రా మైదానంలో పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆర్సీబీ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు ఇచ్చిన బౌలర్‌ టిమ్‌ సౌథీని పక్కకు పెట్టి ఉమేశ్‌ యాదవ్‌ను తుది జట్టులోకి ఆర్సీబీ తీసుకుంది. ఇక పంజాబ్‌ జట్టులోనూ పలు మార్పులు జరిగాయి. ఆండ్రూ టై, మయాంక్‌ అగర్వాల్‌, మురుగన్‌ అశ్విన్‌లకు పంజాబ్‌ అవకాశం కల్పించింది. 

ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని కోహ్లి సేన ఆరాటపడుతోంది. బ్యాటింగ్‌లో పర్వాలేదనుకున్నా.. పేలవమైన బౌలింగ్‌, చెత్త ఫీల్డింగ్‌ ఆర్సీబీ ఓటములకు కారణమవుతున్నాయి. ఒక్క స్టార్‌ బౌలర్‌ లేకపోవడం ఆ జట్టుకు తీరని లోటుగా మారింది. ఇక  ఈ సీజన్‌లో ఇప్పటివరకు పంజాబ్‌ ఏడు మ్యాచ్‌లు ఆడగా నాలుగింట గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. సొంతమైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో తప్పక గెలవాలని అశ్విన్‌ సేన భావిస్తోంది. ముంబైతో మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్న రాహుల్‌ మరోసారి బ్యాట్‌కు పనిచెప్పాలని పంజాబ్‌ కోరుకుంటుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో బలంగా ఉన్న పంజాబ్‌పై ఆర్సీబీ ఏ మేరకు పోరాడుతుందో వేచి చూడాలి. 

తుది జట్లు: 
కింగ్స్‌ పంజాబ్‌: రవిచంద్రన్‌ అశ్విన్‌(కెప్టెన్‌), క్రిస్‌ గేల్‌, కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, నికోలస్‌ పూరన్‌, మన్‌దీప్‌ సింగ్‌, స్యామ్‌ కరన్‌, ఆండ్రూ టై, మహ్మద్‌ షమీ, మురుగన్‌ అశ్విన్‌

ఆర్సీబీ: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), పార్థీవ్‌ పటేల్‌, డివిలియర్స్‌, మొయిన్‌ అలీ, స్టొయినిస్‌, అక్షదీప్‌ నాథ్‌, పవన్‌ నేగి, ఉమేశ్‌ యాదవ్‌, చహల్‌, నవదీప్‌ సైనీ, సిరాజ్‌   

Liveblog

మరిన్ని వార్తలు