పాపం.. ఆర్సీబీకి మరో ఓటమి

6 Apr, 2019 00:15 IST|Sakshi

రసెల్‌ మరో విధ్వంసకర ఇన్నింగ్స్‌

భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయిన ఆర్సీబీ

కోహ్లి సేన కొంప ముంచిన చెత్త ఫీల్డింగ్‌

బెంగళూరు: కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించి కూడా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఘోర ఓటమి చవిచూసింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌ 12లో భాగంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ అనూహ్యంగా ఓటమి చవిచూసింది. ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఇది ఐదో ఓటమి. దీంతో ఈ మ్యాచ్‌ చూసిన ప్రతీ ఒక్కరు ఆర్సీబీని జాలిగా చూశారు. 206 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా ఆర్సీబీ కాపాడుకోలేకపోయింది. మరో ఐదు బంతులు మిగిలుండగానే కేవలం ఐదు వికెట్లు కోల్పోయి కేకేఆర్‌ లక్ష్యాన్ని చేదించింది. పసలేని బౌలింగ్‌కు తోడుగా చెత్త ఫీల్డింగ్‌ ఆర్సీబీ కొంపముంచింది. సిరాజ్‌ ఒక్కడే రెండు సులువైన క్యాచ్‌లు నేలపాలు చేయడం గమనార్హం. ఛేదనలో క్రిస్‌ లిన్‌(43), రాణా(37), ఊతప్ప(33)లు రాణించారు.  అయితే  ఫలితం ఇరు జట్లకు అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన విధ్వంసకర ఆటగాడు ఆండ్రీ రసెల్‌ మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. ఆర్సీబీ చేతుల్లోంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు.

రసెల్‌ సిక్సర్ల వర్షం
ఆర్సీబీ ఓడిపోవడానికి కేకేఆర్‌ గెలవడానికి ఒకేఒక కారణం రసెల్‌. నితీష్‌ రాణా అవుటైన అనంతరం క్రీజులోకి వచ్చిన ఈ విధ్వసంకర ఆటగాడు ఉప్పెనలా రెచ్చిపోయాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రసెల్‌ ధాటికి 18,19 ఓవర్లలో 23,29 పరుగులు వచ్చాయి. ఓవరాల్‌గా రసెల్‌ కేవలం 13 బంతుల్లో 1 ఫోరు, 7 సిక్సర్ల సహాయంతో 48 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేశాడు. ఆర్సీబీ బౌలర్లలో నేగి, సైనీలు తలో రెండు వికెట్లు పడగొట్టగా, చహల్‌ ఒక్క వికెట్‌ దక్కించుకున్నాడు.  

ఆర్సీబీ భారీ స్కోర్‌
అంతకముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ఆర్సీబీకి ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. ఓపెనర్‌ పార్థీవ్‌ పటేల్‌(25) అవుటైన అనంతరం క్రీజులోకి వచ్చిన డివిలియర్స్‌కు జతగా కోహ్లి కలిశాడు. ఇద్దరూ ఆచితూచి ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్‌ బోర్డు పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో విరాట్‌ కోహ్లి(84), డివిలియర్స్‌(63)లు అర్దసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఇక చివర్లో స్టొయినిస్‌(23) మెరుపులు మెరిపించడంతో 20 ఓవరల్లో మూడు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. కేకేఆర్‌ బౌలర్లలో నరైన్‌, రాణా, కుల్దీప్‌లు తలో వికెట్‌ సాధించారు. 

మరిన్ని వార్తలు