బుమ్రా బౌల్డ్‌ చేస్తాడు.. మరి అశ్వినేమో..

22 Apr, 2019 18:53 IST|Sakshi

అశ్విన్‌పై స్టెయిన్‌ సెటైర్‌

హైదరాబాద్‌: కింగ్స్‌ పంజాబ్‌ సారథి రవించంద్రన్‌ అశ్విన్‌కు ‘మన్కడింగ్‌’ మచ్చ ఇప్పట్లో తొలిగేలా కనిపించడం లేదు. వీలుచిక్కినప్పుడల్లా నెటిజన్లు, క్రికెటర్లు అశ్విన్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇప్పటికే డేవిడ్‌ వార్నర్‌, శిఖర్‌ ధావన్‌లు మైదానంలోనే అశ్విన్‌కు ‘మన్కడింగ్‌’ను గుర్తు చేస్తూ ఆటపట్టించారు. తాజాగా  రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు స్పీడ్‌గన్‌ డెల్‌ స్టెయిన్‌ అశ్విన్‌ను ఎగతాళి చేస్తూ ట్వీట్‌ చేశాడు.
‘బ్యాట్స్‌మెన్‌ ఎక్కువగా బుమ్రా బౌలింగ్‌లో బౌల్డ్, రబడ బౌలింగ్‌లో క్యాచ్‌ఔట్‌, తాహీర్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అవుతారు. కానీ అశ్విన్‌ బౌలింగ్‌లో మన్కడింగ్‌తో అవుటవుతారు’అంటూ అశ్విన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం స్టెయిన్‌కు సంబంధించిన ట్వీట్‌ తెగ వైరల్‌ అవుతోంది. స్టెయిన్‌ కరెక్ట్‌గా చెప్పారంటూ నెటిజన్లు రీట్వీట్‌ చేస్తూన్నారు. ఇక ఆలస్యంగా ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్పీడ్‌గన్‌.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో అదరగొట్టాడు. స్టెయిన్‌ రాకతో బలహీనంగా ఉన్న ఆర్సీబీ బౌలింగ్‌ విభాగానికి బలం చేకూరింది.    

అసలేం జరిగిందంటే..?
ఐపీఎల్‌ సీజన్‌ 12లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జోస్‌ బట్లర్‌ను మన్కడింగ్‌ విధానంతో ఔట్‌ చేయడంతో అశ్విన్‌ వివాదాన్ని కొని తెచ్చుకున్నాడు. అశ్విన్‌ బంతి వేయబోయే సమయానికే బట్లర్‌ క్రీజ్‌ వదిలి కాస్త ముందుకు వచ్చాడు. దాంతో వెంటనే చేతిని వెనక్కి తీసుకున్న అశ్విన్‌ బెయిల్స్‌ను పడగొట్టి అప్పీల్‌ చేశాడు. థర్డ్‌ అంపైర్‌ కూడా దానిని ఔట్‌గానే ప్రకటించడంతో బట్లర్‌ వెనుదిరగాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాదోపవాదం కూడా చోటు చేసుకుంది. అశ్విన్‌ తీరుపై నెటిజన్లు, మాజీ ఆటగాళ్లు దుమ్మెత్తిపోశారు.

మరిన్ని వార్తలు