వరుణ్‌ చక్రవర్తి ఔట్‌

1 May, 2019 19:26 IST|Sakshi

మొహాలి: కింగ్స్‌ పంజాబ్‌ యువ ఆటగాడు వరుణ్‌ చక్రవర్తి గాయం కారణంగా ఐపీఎల్‌ మిగతా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. కొద్ది రోజుల క్రితం ప్రాక్టీస్‌ సెషన్‌లో గాయపడిన అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ప్రాక్టీస్‌లో భాగంగా చేతి వేలికి తీవ్ర గాయమైంది. దీంతో వైద్యులు వరుణ్‌కు విశ్రాంతి అవసరమని తేల్చి చెప్పారు. తాజాగా మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించగా ఈ తమిళనాడు లెగ్‌ స్పిన్నర్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో మరింత విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో తాజా ఐపీఎల్‌ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు.  

ఈ సీజన్‌లో ఒకేఒక మ్యాచ్‌ ఆడిన ఈ యువ స్పిన్నర్‌.. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ దక్కించుకున్నాడు. కేకేఆర్‌ మ్యాచ్‌ అనంతరం వరుణ్‌కు కింగ్స్‌ పంజాబ్‌ మరో అవకాశం ఇవ్వలేదు.  గతేడాది చివర్లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో అత్యధిక ధర పలికి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు తమిళనాడు యువ క్రికెటర్‌ వరుణ్‌ చక్రవర్తి. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఏకంగా 8.4 కోట్ల‌కు వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తిని పంజాబ్ కింగ్స్ ద‌క్కించుకుంది. విశేష‌మేమిటంటే ఇత‌ని ధ‌ర కేవ‌లం రూ.20 ల‌క్ష‌లుగా మాత్ర‌మే నిర్ణ‌యించ‌డం జ‌రిగింది. కానీ, ఊహించ‌ని రీతిలో 8.4 కోట్ల‌కు ధ‌ర ప‌ల‌క‌డం విశేషం. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో ఆకట్టుకోవడంతో వరుణ్‌కు ఈ బంపర్‌ ఆఫర్‌ లభించింది.

మరిన్ని వార్తలు