ఐపీఎల్‌ 2020 రద్దు! 

24 Mar, 2020 04:35 IST|Sakshi

ముంబై: ‘కరోనా హైరానా నడుస్తున్న ప్రస్తుత సమయంలో ఐపీఎల్‌ అప్రధానమైన అంశం’ అని ఓ ఫ్రాంచైజీ అధికారి పలికిన పలుకు ఇది. ఐపీఎల్‌పై సమీక్షా సమావేశం నిరవధికంగా వాయిదా వేసిన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ). భారత్‌లోని నగరాలన్నీ లాక్‌డౌన్‌. రాష్ట్ర సరిహద్దులు మూసివేత.ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని ఆపేశారు. తాజాగా దేశవాళీ సర్వీసులు కూడా నిలిపేసేందుకు నిర్ణయించారు. పై విషయాలు చదివితే ఇప్పటికే మనకంతా అర్థమవ్వాలి ఐపీఎల్‌13వ సీజన్‌ రద్దేనని..! ఇంతకుమించి లీగ్‌పై మరే అప్‌డేట్‌ను ఆశించడం ఆత్యాశే అవుతుంది. ప్రపంచంతోనే కరోనా ఆడుకుంటున్న ఈ తరుణంలో ఇప్పుడు ఏ ఆటలూ సాగడం లేదు.

ఐపీఎల్‌ పాలకమండలి చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ మాట్లాడుతూ... లీగ్‌పై చర్చించడానికి ఏ మీటింగ్‌ లేదని కరాకండీగా చెప్పేశారు. గతంలో ఏప్రిల్‌ 15 వరకు లీగ్‌ను వాయిదా వేసినప్పటికంటే ఇప్పుడు పరిస్థితులు మరింత దిగజారాయి. పక్కరాష్ట్రం వ్యక్తులు, వాహనాల్నే తమ రాష్ట్రాల్లోకి రానీయడం లేదు. విదేశీయులు వచ్చే విమానాల్ని రానిస్తారా? ఇంకా చెప్పాలంటే పగలు పప్పు, ఉప్పు కోసం, రాత్రయితే మందుల (మెడిసిన్‌) కోసమే రోడ్డుపై తిరిగే పరిస్థితి ఉంది. అత్యవసర సేవల వాహనాలు కాకుండా ఏ వాహనమైనా కనిపిస్తే సీజ్‌ చేసే చట్టాన్ని అమల్లోకి తెచ్చాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ ఆటల్ని సాగనిచ్చే పరిస్థితే లేదు. కాబట్టి రద్దు తప్ప వాయిదాకు అవకాశం లేదు. ఇదే విషయాన్ని బీసీసీఐ వర్గాలు కూడా చెబుతున్నప్పటికీ అధికారికంగా మాత్రం వెల్లడించేందుకు ఇంకాస్త సమయం తీసుకుంటుంది. ఏప్రిల్‌ మొదటివారంలో ‘రద్దు’ ముచ్చట మన ముందుంచే అవకాశముంది. 

>
మరిన్ని వార్తలు