డీల్‌ కుదిరింది.. రేపో మాపో ప్రకటన?

7 Nov, 2019 15:26 IST|Sakshi

హైదరాబాద్‌ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-2020 కోసం ప్రాంచైజీలు, ఆటగాళ్లు ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నారు. కోచ్‌, ఆటగాళ్ల మార్పులు శరవేగంగా జరుగుతున్నాయి. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దికోవాలని ఆటగాళ్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రాంచైజీలు తమను పక్కకు పెట్టక ముందే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ జాబితాలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు కింగ్స్‌ పంజాబ్‌ సారథి రవిచంద్రన్‌ అశ్విన్‌. గత సీజన్‌లో అశ్విన్‌ సారథ్యంలో పంజాబ్‌ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అంతేకాకుండా ఆటగాడిగా కూడా అశ్విన్‌ ఎలాంటి మ్యాజిక్‌ చేయలేదు. దీంతో అశ్విన్‌తో పనేంటి అని పంజాబ్‌ భావిస్తున్నట్లు, అంతేకాకుండా అతడిని జట్టు నుంచి సాగనంపేందుకే రంగం సిద్దమైనట్లు అనేక వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా అశ్విన్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ఒప్పందం జరిగిందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని విశ్వసనీయ సమాచారం. 

అనుభవలేమితో గత సీజన్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌తో ఆ లోటను భర్తీ చేయాలని భావిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా అశ్విన్‌కు భారీ మొత్తంలో ఆఫర్‌ చేసి అతడితో ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం. అయితే అశ్విన్‌ను సారథిగా కాకుండా కేవలం అనుభవజ్ఞుడైన ఆటగాడినే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కింగ్స్‌ పంజాబ్‌ కూడా అశ్విన్‌ను పరిగణలోకి తీసుకోకుండా జట్టు కూర్పుపై అధ్యయనం చేస్తోందని సమాచారం. కేఎల్‌ రాహుల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని పంజాబ్‌ యాజమాన్యం అనుకుంటోందని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో కింగ్స్‌ పంజాబ్‌తో అశ్విన్‌ ప్రయాణం దాదాపుగా ముగిసినట్టేనని తెలుస్తోంది.  

అనిల్‌ కుంబ్లే పంజాబ్‌ హెడ్‌ కోచ్‌గా నియామకం అయ్యాక అశ్విన్‌ భవిత్యంపై క్లారిటీ వస్తుందని అందరూ భావించారు. అయితే అశ్విన్‌పై కుంబ్లే సానుకూలంగా ఉన్నప్పటికీ ప్రాంచైజీ మాత్రం ఆసక్తిగా లేనట్టు తెలుస్తోంది. దీంతో కుంబ్లే కూడా పంజాబ్‌ తరుపున అశ్విన్‌ ఆడతాడా లేడనేదానిపై స్పష్టత ఇవ్వలేకపోతున్నాడు. దీంతో అశ్విన్‌ తనదారి తను చూసుకున్నట్లు సమాచారం. ఇక ఇప్పటివరకు చెన్నై సూపర్‌కింగ్స్‌, రైజింగ్‌ పుణే, కింగ్స్‌ పంజాబ్‌ జట్ల తరుపున ఆడిన అశ్విన్‌ అన్ని కుదిరితే వచ్చే సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరుపున బరిలోకి దిగే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు