రహానేకు బంపర్‌ ఆఫర్‌.. ఒప్పుకుంటాడా? వద్దంటాడా?

12 Aug, 2019 20:29 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఎంఎస్‌ ధోని పర్యాయ పదంగా మారినట్టే.. రాజస్తాన్‌ రాయల్స్‌కు అజింక్యా రహానే మారుపేరుగా నిలిచాడు. సుదీర్ఘ కాలంగా రాజస్తాన్‌కు వెన్నంటి నిలిచినా రహానే.. వచ్చే సీజన్‌లో ఫ్రాంచైజీ మారబోతున్నాడా అంటే అవుననే చెబుతున్నాయి క్రీడా వర్గాలు. ఐపీఎల్‌ 2020 సీజన్‌ కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇప్పట్నుంచే కసరత్తులు ప్రారంభించింది. ఐపీఎల్‌ 12లో శ్రేయాస్‌ అయ్యర్‌ సారథ్యంలోని యువ ఆటగాళ్లు దుమ్ము దులిపారు. దీంతో 2012 అనంతరం తొలిసారి ఐపీఎల్‌ 12లో ప్లేఆఫ్‌కు చేరింది. 

అయితే వచ్చే సీజన్‌కు అనుభవం, యువతతో మిళితమై ఉండేలా ఢిల్లీ క్యాపిటల్స్‌ జాగ్రత్తలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా సీనియర్‌ ఆటగాడు, కెప్టెన్‌గా అనుభవం ఉన్న అజింక్యా రహానేను జట్టులోకి చేర్చుకోవాలని ఢిల్లీ ఆరాటపడుతోంది. ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. దీనికోసం రహానేకు భారీ మొత్తంలో ఆఫర్‌ ఇచ్చినట్టు సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు రహానే, ఢిల్లీ అధికారిక ప్రకటన చేయలేదు. అయితే అన్నీ కుదిరితే వచ్చే సీజన్‌లో రహానే ఢిల్లీ తరుపున ఆడే అవకాశం ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. 

ఐపీఎల్‌ ప్రారంభ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడిన రహానే.. అనంతరం 2011లో రాజస్తాన్‌ రాయల్స్‌కు మారాడు. సారథిగా, ఆటగాడిగా రాజస్తాన్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. గత సీజన్‌లో ఏకంగా సెంచరీ సాధించి పొట్టి ఫార్మట్‌లో యువ ఆటగాళ్లతో తానేమి తీసిపోనని నిరూపించాడు. ఇక ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను గతేడాది జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ చేజిక్కించుకున్న వెంటనే జట్టులో సమూల మార్పులు చేసింది. పేరుతో సహా ఆటగాళ్లను, కోచింగ్‌ బృందాన్ని మార్చింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధావన్‌ను జట్టులోకి తీసుకుంది. విజయ్‌ శంకర్‌తో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లను సన్‌రైజర్స్‌కు ఇచ్చి ధావన్‌ను ఢిల్లీ తీసుకుంది. తాజాగా ఐపీఎల్‌ 13 కోసం మరిన్ని మార్పులు చేయడానికి ఢిల్లీ పూనుకుంది. 

>
మరిన్ని వార్తలు