‘అతడ్ని వదిలిపెట్టాం.. నిన్ను తీసుకుంటాం’

20 Nov, 2019 09:32 IST|Sakshi

హైదరాబాద్‌: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్టార్‌ హిట్టర్‌ క్రిస్‌ లిన్‌ను ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-2020 సీజన్‌ వేలంలోకి విడిచిపెట్టడంపై టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ పెదవివిరిచిన విషయం తెలిసిందే. ఇది చెత్త నిర్ణయమంటూ విమర్శించాడు. అయితే యువీ విమర్శలపై కేకేఆర్‌ సీఈఓ వెంకీ మైసూర్‌ ఫన్నీగా స్పందించాడు. ‘యువరాజ్‌ సింగ్‌ మేము హిట్టర్‌ క్రిస్‌ లిన్‌ను వదిలిపెట్టాం. దీంతో కేకేఆర్‌ వేలంలో నిన్ను తీసుకోవడానికి బిడ్‌ వేయవచ్చు!. ఇద్దరు చాంపియన్ల(లిన్‌, యువీ)పై ప్రేమ, గౌరవం ఎప్పటికీ ఉంటుంది’అంటూ కేకేఆర్‌ సీఈఓ ట్వీట్‌ చేశాడు. 

‘క్రిస్‌లిన్‌ని కేకేఆర్‌ ఎందుకు రిటైన్ చేసుకోలేదో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అతడిని వేలంలోకి వదిలేయడమనేది కేకేఆర్‌ తీసుకున్న చెత్త నిర్ణయం. ఈ విషయమై కోల్‌కతా నైట్‌రైడర్స్ సహ యజమాని షారూక్ ఖాన్‌కి మెసేజ్ చేస్తా’ అని యువరాజ్ సింగ్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్‌–2020 వేలానికి ముందు ఎనిమిది ఫ్రాంచైజీలు పెద్ద సంఖ్యలో ఆటగాళ్లను వదిలేసుకున్నాయి. వీరిలో కొందరు వరుస వైఫల్యాలతో జట్టుకు బలహీనతగా మారగా... మరికొందరు వేలంలో భారీ మొత్తాలకు అమ్ముడై అదే స్థాయి ప్రదర్శన కనబర్చకుండా భారంగా మారిపోయారు. దీంతో క్రిస్‌ లిన్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, వరుణ్‌ చక్రవర్తి వంటి ఖరీదైన ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు వదిలేసుకున్నాయి. 

మరిన్ని వార్తలు