మురళీ విజయ్‌కు గుడ్‌ బై..!

12 Nov, 2019 14:57 IST|Sakshi

చెన్నై: గతేడాది డిసెంబర్‌లో పెర్త్‌లో ఆసీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్‌ తరఫున చివరిసారి కనిపించిన విజయ్‌.. ఇప్పటికీ రెగ్యులర్‌ ఆటగాడిగా చోటు సంపాదించుకోలేపోయాడు. టెస్టు ఓపెనర్లుగా కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌లకు తోడు ఇప్పుడు రోహిత్‌ శర్మ కూడా అందుబాటులో ఉండటంతో మురళీ విజయ్‌ను టీమిండియా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. కాగా, ఈ ఏడాది ఆగస్టులో తాను దేశం కోసం ఆడాలని ఏనాడు కోరుకోనని, ఫ్యాషన్‌ కోసం మాత్రమే క్రికెట్‌ ఆడతానంటూ మనసులో మాట బయటపెట్టాడు.

కాగా, గత రెండేళ్లుగా ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న మురళీ విజయ్‌.. ఈసారి సీఎస్‌కే జట్టులో ఉండకపోవచ్చు. వచ్చే నెలలో జరుగనున్న ఐపీఎల్‌ వేలంలో భాగంగా సీఎస్‌కే విడుదల చేసే ఆటగాళ్లలో మురళీ విజయ్‌ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. అసలు మురళీ  విజయే అవసరమే చెన్నైకు రాకపోవడంతో అతన్ని అంటిపెట్టుకోవడం  వల్ల లాభం లేదని యోచనలో సదరు ఫ్రాంచైజీ ఉంది. గత రెండు సీజన్లుగా రెండు కోట్ల జీతంతో చెన్నై జట్టులో కొనసాగుతున్నాడు విజయ్‌.  2018,19 సీజన్లలో మూడు మ్యాచ్‌లు ఆడిన విజయ్‌ కేవం 76 పరుగులు మాత్రమే చేశాడు.అతని వల్ల జట్టుకు ప్రయోజనం లేనప్పుడు రెండు కోట్లు వృథాగా ఇస్తున్నామనేది సీఎస్‌కే భావన. దాంతో 2020 ఐపీఎల్‌ వేలం నాటికి విజయ్‌ను జట్టు నుంచి విడుదల చేసేందుకు సీఎస్‌కే దాదాపు రంగం సిద్ధం చేసింది.  

ఇక కరణ్‌ శర్మ, శార్దూల్‌ ఠాకూర్‌లను కూడా జట్టు నుంచి రిలీజ్‌ చేయడానికి సీఎస్‌కే సిద్ధమైనట్లు సమాచారం. గత రెండు సీజన్లలో లెగ్‌ స్పిన్నర్‌ కరణ్‌ శర్మ తీసిన వికెట్లు ఐదు. మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడి ఐదు వికెట్లను మాత్రమే తీశాడు. మరొకవైపు అతని బౌలింగ్‌ ఎకానమీ రేట్‌ కూడా అంత బాలేదు. అదే సమయంలో కరణ్‌ శర్మకు చెల్లించేది  రూ. 5 కోట్ల రూపాయిలు కావడంతో అతనికి కూడా సీఎస్‌కే నుంచి ఉద్వాసన తప్పదు. మరొకవైపు శార్దూల్‌ ఠాకూర్‌ విషయంలో కూడా సీఎస్‌కే అంతగా ఆసక్తి కనబరచడం లేదు. శార్దూల్‌కు రూ. 2 కోట్లకు పైగా చెల్లించడంతో అందుకు తగ్గ ప్రదర్శన అతని నుంచి రావడం లేదు. గత రెండు సీజన్లలో 23 మ్యాచ్‌లు ఆడిన శార్దూల్‌ 24 వికెట్లు మాత్రమే తీశాడు. దాంతో శార్దూల్‌ కూడా సీఎస్‌కే నుంచి రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంది. ఒక వేళ ఈ ముగ్గుర్నీ సీఎస్‌కే రిలీజ్‌ చేస్తే వీరు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందే.

మరిన్ని వార్తలు