ఐపీఎల్‌ ఆలస్యం 

14 Mar, 2020 01:50 IST|Sakshi

ఏప్రిల్‌ 15 దాకా మ్యాచ్‌లు లేవని బీసీసీఐ ప్రకటన

విదేశీ ఆటగాళ్లు వచ్చాకే ఆడించాలంటోన్న ఫ్రాంచైజీలు

ప్రత్యామ్నాయ వేదికలపై బోర్డు కసరత్తు  

న్యూఢిల్లీ: ‘కరోనా’ మజాకా... ఇది వచ్చాకా అన్నీ వేగంగా మారిపోతున్నాయి. నేడు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఓ రోజు ముందుగానే తీసుకుంది. ఈనెల 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్‌ సీజన్‌ను ఏప్రిల్‌ 15 వరకు వాయిదా వేసింది. అప్పటిదాకా మ్యాచ్‌ల్ని నిలిపివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఆ తర్వాతైనా ఆయా వేదికల్లో సవ్యంగా జరుగుతుందా... లేదా అనేది కూడా అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని రకాల క్రీడా ఈవెంట్లను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ‘కోవిడ్‌–19’ మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఢిల్లీ హోమ్‌ గ్రౌండ్‌. ఢిల్లీ సర్కారు నిర్ణయం వెలువరించిన కొన్ని గంటల వ్యవధిలోనే బీసీసీఐ కూడా స్పందించింది. ‘ఐపీఎల్‌–2020ని ఏప్రిల్‌ 15వ తేదీ వరకు నిలిపివేస్తున్నాం. నోవల్‌ కరోనా వైరస్‌ వ్యాపించకుండా ముందుజాగ్రత్త చర్య ల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు.

అయితే బీసీసీఐ వచ్చేనెల 15 వరకు మ్యాచ్‌ల్ని సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపింది. అయితే ఏప్రిల్‌ 16 నుంచైనా షెడ్యూల్‌ ప్రకారం జరుగుతుందా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. ఎందుకంటే ఢిల్లీ ప్రభుత్వం ఈవెంట్ల రద్దు నిర్ణయం తీసుకోగా... మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు మ్యాచ్‌లకు అనుమతిని నిరాకరిస్తున్నాయి.  పైగా విదేశీ ఆటగాళ్లు ఆడాలంటే వచ్చే నెల 15 వరకు వీసా నిబంధనలపై ఆంక్షలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యం లో బోర్డు, ఐపీఎల్‌ పాలక మండలి ప్రత్యామ్నాయ వేదికలపై కసరత్తు చేస్తున్నాయి. విదేశీ స్టార్లు లేకపోతే ఐపీఎల్‌ కూడా ఓ దేశవాళీ టోర్నీగా మారిపోతుందని దీంతో లీగ్‌ మజానే ఉండదని ఫ్రాంచైజీలు బోర్డుకు తెలిపాయి. అందుకే బోర్డు తాత్కాలికంగా పోటీలను రద్దు చేసింది. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు ఆడనివ్వకపోతే ప్రత్యామ్నాయ వేదికలుగా విశాఖపట్నం, లక్నో, రాజ్‌కోట్, ఇండోర్, రాయ్‌పూర్‌లను పరిశీలిస్తుంది.

ఏం జరగొచ్చు... 
►ఐపీఎల్‌ను పూర్తిగా వాయిదా వేసే అవకాశమే లేదు. ఎందుకంటే భవిష్యత్‌ పర్యటనల కార్యక్రమం (ఎఫ్‌టీపీ) ఎప్పుడో ఖరారైంది. బిజీ షెడ్యూలు వల్ల మార్పులకు అవకాశముండదు 
►మార్చి 29 నుంచి మే 24 వరకు మొత్తం 56 రోజుల ఈవెంట్‌ కాస్తా ఇప్పుడు 39 రోజులకే (ఏప్రిల్‌ 16 నుంచి మే 24) పరిమితం అవుతుంది. 
►ప్రతి రోజూ రెండేసి మ్యాచ్‌లు నిర్వహించాల్సిందే. ఇన్నాళ్లు శని, ఆదివారాల్లోనే రెండు మ్యాచ్‌లు జరిగేవి. 
►ఫ్రాంచైజీలు టికెట్ల రూపేణా కోల్పోయే రాబడిని బీసీసీఐ సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. 
►వేల కోట్ల రూపాయలు వెచ్చించిన స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌కు కూడా ఆర్థిక వెసులుబాటు కల్పించాలి. 
►ఇటీవలే ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించే రాష్ట్ర సంఘాలకు మ్యాచ్‌కు రూ. 30 లక్షలకు బదులుగా రూ.50 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. తాజాగా దీన్ని సమీక్షించే అవకాశం ఉంది.


ప్రస్తుతానికి ఐపీఎల్‌ వాయిదా వేయడం ముఖ్యం. అది జరిగిపోయింది. ప్రజల భద్రతకే అన్నింటికంటే ప్రథమ ప్రాధాన్యత కాబట్టి మేం వాయిదా వేశాం. ఏప్రిల్‌ 15 తర్వాత నిర్వహించగలమా అనేది ఇప్పుడే చెప్పలేం. అది మరీ తొందరపాటు అవుతుంది. మున్ముందు ఏం జరుగుతుందో చూద్దాం. ఐపీఎల్‌ ఫ్రాంచైజీలకు ఇష్టమున్నా, లేకపోయినా మరో ప్రత్యామ్నాయమైతే లేదు.    
–గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

మరిన్ని వార్తలు