ఐపీఎల్‌-2020 విజేత ఆర్సీబీ.. ఇది నిజం

26 May, 2020 08:53 IST|Sakshi

బెంగళూరు: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఐపీఎల్‌-2020 విజేతగా నిలిచింది. సోమవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో భారీ విజయం సాధించి ట్రోఫీని అందుకుంది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్‌ తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి ఇదంతా కల అని అనుకుంటున్నారా? నిజమేనండి. ఆర్సీబీ ఐపీఎల్‌-2020 ట్రోపీ ముద్దాడింది. అయితే విరాట్‌ కోహ్లి, డేవిడ్‌ వార్నర్‌లు మైదానంలో దిగి పరుగుల వరద పారించలేదు.. రషీద్‌ ఖాన్‌, ఉమేశ్‌ యాదవ్‌లు బంతితో చెలరేగలేదు. అయినా ఆర్సీబీ ఫైనల్‌ పోరులో జయకేతనం ఎగరవేసింది. ఎందుకంటే ఆర్సీబీ గెలిచింది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో కాదు ఇండియన్‌ పోల్‌ లీగ్‌. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఐపీఎల్‌-2020 నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే. 

ఈ క్రమంలో ఆర్సీబీ వినూత్నంగా ఆలోచించింది. ​ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం రోజువారి మ్యాచ్‌లకు సంబంధించి పోల్‌ను నిర్వహించింది. ఈ పోల్‌లో అత్యధిక ఓట్లు సాధించిన జట్టుగా ఆ మ్యాచ్‌లో గెలిచినట్లు. ఇలా షెడ్యూల్‌ ప్రకారం జరిగాల్సిన మ్యాచ్‌లకు పోల్‌ నిర్వహించి ఇండియన్‌ పోల్‌ లీగ్‌ను ఆర్బీబీ ఫైనల్‌ వరుకు నిర్విరామంగా కొనసాగించింది. ఇలా సన్‌రైజర్స్‌, ఆర్సీబీ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. ఫైనల్‌ పోరులో 85 శాతం ఓట్లు సాధించిన తమ జట్టు విజేతగా నిలిచిందని ఆర్సీబీ తమ అధికారిక ట్విటర్‌లో పేర్కొంది. ఇక దీనిపై కొందరు నెటిజన్లతో సహా ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై సూపర్‌కింగ్స్‌ ట్విటర్‌ వేదికగా స్పందించింది. (హెరాయిన్‌తో పట్టుబడ్డ క్రికెటర్‌)

‘ఈ సాలా కప్ నమ్‌దే' (ఈ ఏడాది కప్ మనదే)ను అనుకరిస్తూ ‘ఈ ఏడాది కప్‌ మీదే’ అంటూ సీఎస్‌కే సరదాగా ట్వీట్‌ చేసింది. ఇక ఇలాగైనా గెలిచాం అంటూ మరికొందరు ఆర్సీబీ ఫ్యాన్స్‌ పేర్కొంటున్నారు. ప్రపంచ శ్రేణి ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నా ఆర్సీబీ ఇప్పటివరకు ఐపీఎల్‌ ట్రోఫీని కైవసం చేసుకోలేదు. 2016లో మినహా ఏ ఏడాది కూడా కనీస ప్రదర్శన కూడా కనబర్చలేదు. అయితే ఐపీఎల్‌లో అంతగా విఫలమైనప్పటికీ ఆ జట్టుకు పాలోవర్స్‌ సంఖ్య కూసింత కూడా తగ్గలేదు. ప్రతీ ఏడాది అభిమానులను రెట్టింపు చేసుకుంటూ ఆర్సీబీ ముందుకు కదులుతుంది. ఇక ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌-2020 వాయిదా పడితే ఆ సమయంలో ఐపీఎల్‌ నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. (దివికేగిన దిగ్గజం)

మరిన్ని వార్తలు