‘ట్రోఫీని చెన్నైకి తీసుకొస్తాం’

21 Dec, 2019 19:39 IST|Sakshi

హైదరాబాద్‌: ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ స్యామ్‌ కరన్‌ ఎగిరిగంతేస్తున్నాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్‌-2020 వేలంలో ఈ ఇంగ్లీష్‌ క్రికెటర్‌ను చెన్నైసూపర్‌కింగ్స్‌(సీఎస్‌కే) రూ. 5.5కోట్లతో చేజిక్కించుకోవడమే కరన్‌ ఆనందానికి కారణం. ఇంత భారీ మొత్తంలో దిగ్గజ సారథి ధోని సారథ్యంలోని సీఎస్‌కే తరుపున ఆడనుండటంపై కరన్‌ తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాకుండా తన సంతోషాన్ని ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. స్యామ్‌ కరన్‌ వీడియోను సీఎస్‌కే తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. సీఎస్‌కే తరుపున ఆడటానికి చాలా ఉత్సాహంగా ఉన్నట్లు కరన్‌ ఆ వీడియోలో పేర్కొన్నాడు. అంతేకాకుండా ఐపీఎల్‌-2020 ట్రోఫిని చెన్నైకి తీసుకొస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

‘నా ఎంపికకు సహకరించిన ధోని, ఫ్లెమింగ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు. గతంలో చెన్నైలో ప్రత్యర్థి జట్టు సభ్యుడిగా బరిలోకి దిగాను. కానీ ఈసారి చెన్నై అభిమానుల సమక్షంలో సీఎస్‌కే తరుపున ఆడటం ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నాను. అభిమానుల అంచనాలను అందుకునేలా గొప్ప ప్రదర్శన ఇస్తామనే ధీమా ఉంది. అంతేకాకుండా చెన్నైకి రావడానికి, నా కొత్త టీం సభ్యులను కలుసుకోవడానికి ఏ మాత్రం ఆలస్యం చేయకూడదని అనుకుంటున్నాను. ధోని సారథ్యంలో.. ఫ్లెమింగ్‌ కోచింగ్‌లో ఆడటం నాకు దొరికిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఐపీఎల్‌-2020 ట్రోఫిని చెన్నైకి తీసుకొస్తామనే విశ్వాసం ఉంది’అంటూ కరన్‌ పేర్కొన్నాడు. 

ఇప్పటివరకు మూడు ఐపీఎల్‌ టైటిళ్లను గెలుచుకున్న సీఎస్‌కే జట్టు గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచింది. గత సీజన్‌లో అసాధరణ పోరాటపటిమతో ఆకట్టుకున్న ధోని జట్టు చివరి మెట్టుపై బోల్తాపడి ట్రోఫీని చేజార్చుకుంది. అయితే గత అనుభవాల దృష్ట్య జట్టులో అనేక మార్పులు చేసింది. దీనిలో భాగంగా బౌలింగ్‌ విభాగాన్ని మరింత పటిష్టం చేసేందుకు కరన్‌, చావ్లా, హేజిల్‌వుడ్‌లను జట్టులోకి తీసుకుంది. దీంతో సీఎస్‌కే బౌలింగ్‌ దళం దుర్బేద్యంగా తయారయ్యింది. దీంతో వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో ధోని సారథ్యంలోని సీఎస్‌కే జట్టు హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.   

>
మరిన్ని వార్తలు