ఐపీఎల్‌ షెడ్యూల్‌ సాగదీత..!

7 Jan, 2020 19:08 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగబోయే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌ను మరింత సాగదీసేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు అనే అంశం లేకుండా ప్రతీరోజూ ఒక్క మ్యాచ్‌తోనే సరిపెట్టాలనే ప్రణాళికను దాదాపు సిద్ధం చేసింది ఐపీఎల్‌ మేనేజ్‌మెంట్‌. దాంతో ఈసారి ఐపీఎల్‌ 57 రోజుల పాటు కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. మార్చి 29వ తేదీన ప్రారంభించి మే 24వ తేదీతో ఐపీఎల్‌ను ముగించాలని చూస్తున్నారు. ఇది ఇంకా తుది ప్రకటన కాకపోయినప్పటికీ దీన్నే షెడ్యూల్‌ చేసే అవకాశం ఉంది.  ప్రధానంగా రెండు మ్యాచ్‌లను తొలగించేందుకు రంగం సిద్ధమైన తరుణంలో మరో పది రోజులు అదనంగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రతీ మ్యాచ్‌ను రాత్రి గం.7.30ని.లకు ఆరంభించాలని చూస్తున్నారు.

బ్రాడ్‌కాస్టర్స్‌ ప్రతిపాదన మేరకే ప్రతీ రోజూ సింగిల్‌ మ్యాచ్‌ల నిర్వహణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడ టీఆర్పీ కూడా ప్రధాన సమస్యగా మారింది. రోజుకు ఒక్క మ్యాచ్‌ అయితే అభిమానులు ఆసక్తి చూపుతారని బ్రాడ్‌కాస్టర్స్‌ విశ్వసిస్తున్నారు. అసలు ఏ రోజు కూడా రెండు మ్యాచ్‌లు వద్దనే వాదనను తెరపైకి తీసుకురావడంతో ఐపీఎల్‌ షెడ్యూల్‌ను మరింత పొడగించక తప్పకపోవచ్చని ప్రాథమిక సమాచారం. సాధారణంగా శని, ఆదివారాల్లోనే ఎక్కువగా రెండు మ్యాచ్‌లను నిర్వహించడం కొన్నేళ్లుగా కొనసాగుతుంది. వారాంతపు రోజుల్లో రెండు మ్యాచ్‌లు నిర్వహిస్తే అందుకు అభిమానుల నుంచి విశేష మద్దతు లభిస్తుందనే కారణంతో దాన్నే  కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే బ్రాడ్‌కాస్టర్స్‌ మాత్రం టీఆర్పీపై ప్రధానంగా దృష్టి పెట్టారు.  ఒక్క మ్యాచ్‌ అయితే అందుకు మరింత రేటింగ్‌ వస్తుందని ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే 13వ సీజన్‌ ఐపీఎల్‌ను 57 రోజులు పాటు నిర్వహించడానికి సమాయత్తమవుతున్నారు.

మరిన్ని వార్తలు