ఢిల్లీ క్యాపిటల్స్‌కు రహానే 

15 Nov, 2019 03:26 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్, ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ప్రధాన బ్యాట్స్‌మన్‌ అజింక్య రహానే ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు మారాడు. ఐపీఎల్‌ వేలానికి ముందు జట్ల మధ్య ఆటగాళ్ల బదిలీలకు గురువారం (నవంబర్‌ 14) ఆఖరి రోజు కాగా... రాయల్స్‌ మాజీ కెప్టెన్‌ను ఢిల్లీ చేజిక్కించుకుంది. రహానేకు ప్రతిగా ఢిల్లీ లెగ్‌ స్పిన్నర్‌ మయాంక్‌ మార్కండే, బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ రాహుల్‌ తేవాటియాలను క్యాపిటల్స్‌ జట్టు రాజస్తాన్‌కు విడుదల చేసింది. 2011 నుంచి 2019 వరకు సుదీర్ఘంగా రాయల్స్‌ తరఫున 100 ఐపీఎల్‌ మ్యాచ్‌లాడిన 31 ఏళ్ల రహానే 24 మ్యాచ్‌లకు సారథిగాను వ్యవహరించాడు. 122.65 స్ట్రయిక్‌రేట్‌తో 2810 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 17 అర్ధసెంచరీలున్నాయి. ఓవరాల్‌గా తన ఐపీఎల్‌ కెరీర్‌లో 3098 పరుగులు చేశాడు. ఇది వరకే అనుభవజ్ఞుడైన స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను తెచ్చుకున్న ఢిల్లీ తాజాగా రహానేను చేర్చుకోవడంతో జట్టు బలం పెరిగింది. డాషింగ్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్, రిషభ్‌ పంత్, శ్రేయస్‌ అయ్యర్‌లతో కూడిన క్యాపిటల్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌ ఇప్పుడు పటిష్టంగా మారింది.

మరిన్ని వార్తలు