‘కత్తి’లాంటోడు..!

10 May, 2016 01:24 IST|Sakshi
‘కత్తి’లాంటోడు..!

ఏడాది క్రితం అతని పేరు కూడా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు... క్రికెట్ ప్రపంచం అంతా అతడిని కీర్తిస్తోంది. ప్రత్యర్థి క్రికెటర్లు కొన్ని వందలసార్లు అతని బౌలింగ్ వీడియోలు చూస్తున్నారు. కానీ మైదానంలోకి దిగాక ఎవరికీ కొరుకుడు పడని బంతులు వేస్తున్నాడు. ఈ సీజన్ ఐపీఎల్‌లో పరుగుల వరద పారిస్తున్న విరాట్ కోహ్లి కూడా అతని ధాటికి వెంటనే పెవిలియన్‌కు చేరాడు. ఆ సంచలనం పేరు ముస్తాఫిజుర్ రెహమాన్. బంగ్లాదేశ్‌కు చెందిన 20 ఏళ్ల ఈ యువ బౌలర్ ఇప్పుడు ఐపీఎల్ ద్వారా మరింత ప్రకంపనలు పుట్టిస్తున్నాడు. నిలకడగా బౌలింగ్ చేస్తూ సన్‌రైజర్స్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.
 
సాక్షి క్రీడావిభాగం: గత జూన్‌లో భారత్‌తో వన్డే ద్వారా ముస్తాఫిజుర్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే తన ఆఫ్ కట్టర్స్‌తో బెంబేలెత్తించి ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఆ షాక్ నుంచి ధోనిసేన కోలుకునేలోగానే రెండో వన్డేలో ఆరు వికెట్లతో చెలరేగిపోయాడు. దీంతో తొలిసారి భారత్‌పై బంగ్లాదేశ్ వన్డే సిరీస్ గెలిచింది. దీంతో బంగ్లాదేశ్‌లో ముస్తాఫిజుర్ హీరోగా మారిపోయాడు. అయితే ఇలాంటి బౌలర్లు గతంలో చాలామంది వచ్చారని, ముస్తాఫిజుర్ కూడా ఈ సంచలనాలు ఎక్కువ కాలం కొనసాగించలేడనే వాదన కూడా వినిపించింది.

అయితే ఏడాది గడిచినా ప్రపంచంలోని టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్ కూడా ఇప్పటికీ అతని ఆఫ్ కట్టర్స్‌ను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ ఏడాది కాలంలో మొత్తం 24 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అతను 52 వికెట్లు తీసుకున్నాడు. గత ఏడాది కాలంలో బంగ్లాదేశ్ సంచలన విజయాల్లో ముస్తాఫిజుర్‌దీ కీలకపాత్ర.
 
చౌకగానే సన్‌రైజర్స్‌కు...
ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ముస్తాఫిజుర్‌ను సన్‌రైజర్స్ జట్టు రూ.1.4 కోట్లు పెట్టి కొనుక్కుంది. నిజానికి అతని నైపుణ్యానికి ఇంతకంటే ఎక్కువ రేటు రావాల్సింది. కానీ ముస్తాఫిజుర్ ఇంకా ఈ స్థాయిలో రాణిస్తాడని ఏ జట్టూ ఊహించలేదు. ‘తన ఆఫ్ కట్టర్స్‌ను ఇంకా చాలామంది బ్యాట్స్‌మెన్ అర్థం చేసుకోలేదు. కాబట్టి కచ్చితంగా అతను మా బలమవుతాడు’ అని సన్‌రైజర్స్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ వేలం సమయంలో అభిప్రాయపడ్డారు. ఒక రకంగా తను చౌకగానే ఈ జట్టుకు దొరికాడు.

అయితే బౌల్ట్ లాంటి ప్రపంచ స్థాయి బౌలర్‌తో పాటు ఆశిష్ నెహ్రా, బరీందర్ శరణ్‌లాంటి భారత ఎడమచేతి వాటం బౌలర్లు ఉన్నందున తుది జట్టులో ముస్తాఫిజుర్‌కు చోటు దక్కుతుందని అతను కూడా అనుకోలేదట. కానీ అనూహ్యంగా తొలి మ్యాచ్‌లోనే తుది జట్టులోకి వచ్చాడు.
 
ఐపీఎల్‌లో జోరు...
సీజన్ తొలి మ్యాచ్‌లో బెంగళూరుతో మ్యాచ్‌లో సన్ బౌలర్లు 227 పరుగులు ఇచ్చారు. అయితే ముస్తాఫిజుర్ మాత్రం తన నాలుగు ఓవర్లలో కేవలం 26 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ నిలకడగా బంతులు వేస్తున్న అతను పంజాబ్‌పై నాలుగు ఓవర్లలో కేవలం 9 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ వికెట్లు అవసరమైన సమయంలో... స్లాగ్ ఓవర్లలో కెప్టెన్ వార్నర్ బంతి ముస్తాఫిజుర్‌కు ఇస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 9 మ్యాచ్‌లు ఆడిన ఫిజ్... 13 వికెట్లు తీసుకున్నాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో అందరికంటే పొదుపుగా (6.15 ఎకానమీ) బౌలింగ్ చేశాడు.
 
సుదీర్ఘకాలం ఉంటాడా?
ఏడాది అంతర్జాతీయ క్రికెట్ అనుభవంలోనే ముస్తాఫిజుర్ రెండుసార్లు గాయాల బారిన పడ్డాడు. ఏ ఫాస్ట్ బౌలర్‌కైనా గాయాలు సహజం. ముస్తాఫిజుర్‌కు కూడా ఇప్పుడు తనని తాను గాయాల నుంచి కాపాడుకోవడమే కీలకం. చాలామంది బౌలర్లు గతంలో రెండు మూడేళ్లు సంచలన బౌలర్లుగా ప్రభావం చూపినా ఆ తర్వాత కనుమరుగయ్యారు. కారణం ప్రత్యర్థులు వారి బౌలింగ్‌ను పూర్తిగా అర్థం చేసుకోవడం. ఏ బౌలర్ అయినా ఎప్పటికప్పుడు మెరుగైతేనే సుదీర్ఘకాలం మనగలుగుతాడు.

ముస్తాఫిజుర్‌లో ఈ నైపుణ్యం ఉందని సన్‌రైజర్స్ బౌలింగ్ మెంటార్ మురళీధరన్ అభిప్రాయపడుతున్నారు. ‘సరైన గెడైన్స్‌తో ప్రణాళికతో వెళితే ముస్తాఫిజుర్ సుదీర్ఘకాలం అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతాడు’ అని ఆయన అన్నారు. భవిష్యత్ సంగతి ఎలా ఉన్నా ఈ సీజన్ ఐపీఎల్‌లో చివరి వరకూ ఇదే నిలకడ కనబరచి సన్‌రైజర్స్‌ను చాంపియన్‌గా నిలపాలని ఆశిద్దాం.
 
స్ఫూర్తిదాయక నేపథ్యం
బంగ్లాదేశ్‌లోని సత్కిరా అనే పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల పల్లెటూరు టెటూలియా ముస్తాఫిజుర్ స్వస్థలం. చిన్నప్పుడు తన ముగ్గురు అన్నలతో కలిసి సరదాగా టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడేవాడు. 12 ఏళ్ల వయసులో తనలో క్రికెట్ టాలెంట్‌ను గుర్తించిన అతని తండ్రి అబుల్ ఖాసీం ఘాజీ సత్కిరా పట్టణానికి శిక్షణ కోసం పంపించారు. దీనికోసం తన అన్న వెనుక బండి మీద కూర్చుని రోజూ 40 కిలోమీటర్లు వెళ్లి ప్రాక్టీస్ చేసేవాడు. దీంతో చదువు అటకెక్కింది.

అయినా తనలో నైపుణ్యం ఉందని కోచ్‌లు చెప్పడంతో 2012లో ఢాకా వచ్చాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పేస్ బౌలింగ్ ఫౌండేషన్‌కు ఎంపికయ్యాడు. రెండేళ్లలోనే (2014) అండర్-19 ప్రపంచకప్‌కు ఎంపికయ్యాడు. 2014లో దేశవాళీ క్రికెట్‌లో నిలకడ, 2015 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఢాకా డైనమైట్స్ తరఫున 10 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీయడంతో జాతీయ జట్టులో అవకాశం లభించింది. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ముస్తాఫిజుర్ అంచెలంచెలుగా ఎదిగిన వైనం బంగ్లాదేశ్‌లోని ఎందరో యువ క్రికెటర్లకు స్ఫూర్తి. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ముస్తాఫిజుర్‌కు క్రేజ్ బాగా పెరిగింది. రోజూ వందల సంఖ్యలో లవ్‌లెటర్స్ వస్తున్నాయట.
 
డిమాండ్ పెరిగింది...ప్రస్తుతం టి20 క్రికెట్‌లో సునీల్ నరైన్ తర్వాత అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన రికార్డు ముస్తాఫిజుర్‌ది. ఇప్పటికే అతను అనేక ఘనతలు సొంతం చే సుకున్నాడు. షకీబ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో సంచలనంగా మారిన ముస్తాఫిజుర్ తమ లీగ్‌లలో ఆడాలని అన్ని దేశాలూ కోరుకుంటున్నాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ అతణ్ని తీసుకుంది. కానీ గాయం కారణంగా ఈ లీగ్‌లో అతను ఆడలేదు. ఐపీఎల్ తర్వాత ఇంగ్లండ్ కౌంటీల్లో ససెక్స్ తరఫున ఆడబోతున్నాడు. ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్ జట్లు కూడా ముస్తఫిజుర్‌తో చర్చలు జరుపుతున్నాయి. ఒకరకంగా ప్రస్తుతం అతను ప్రపంచ క్రికెట్‌లో హాట్ పేస్ బౌలర్.

మరిన్ని వార్తలు