కోట్లతో ‘జై’ కొట్టారు

29 Jan, 2018 04:10 IST|Sakshi
జైదేవ్‌ ఉనాద్కట్‌

వేలంలో రూ.11.5 కోట్ల ధర పలికిన లెఫ్టార్మ్‌ పేసర్‌

భారత ఆటగాళ్లలో అత్యధిక మొత్తానికి రాజస్తాన్‌ సొంతం

కృష్ణప్ప గౌతమ్‌కు రూ. 6.2 కోట్లు

క్రిస్‌ గేల్‌ను తీసుకున్న పంజాబ్‌

రూ. 2.6 కోట్లతో బెంగళూరుకు సిరాజ్‌   

అనూహ్యానికి, ఆశ్చర్యానికి అడ్రస్‌లాంటి ఐపీఎల్‌ వేలంలో మరో పెద్ద సంచలనం. ఏడేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో భారత్‌ తరఫున డజను మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగిన లెఫ్టార్మ్‌ పేస్‌ బౌలర్‌ జైదేవ్‌ ఉనాద్కట్‌పై కోట్ల వర్షం కురిసింది. రాజస్తాన్‌ రాయల్స్‌ ఏకంగా రూ. 11.5 కోట్ల మొత్తానికి అతడిని సొంతం చేసుకొని అందరికీ షాక్‌ ఇచ్చింది. గత ఏడాది ఐపీఎల్‌లో నిలకడగా రాణించడం ఒక కారణమైనా... ఇంత భారీ ధర పలకడం మాత్రం నివ్వెరపరిచేదే!  తాజా వేలంలో అత్యధిక మొత్తానికి అమ్ముడుపోయిన భారత ఆటగాడిగా నిలిచిన ఉనాద్కట్‌... స్టోక్స్‌ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. అన్‌క్యాప్డ్‌ ఆటగాడు కృష్ణప్ప గౌతమ్‌కు రూ.6.2 కోట్లు లభించడం మరో విశేషం కాగా... ఎట్టకేలకు రూ. 2 కోట్ల కనీస ధరతో క్రిస్‌ గేల్‌ పంజాబ్‌ చెంత చేరడం కొసమెరుపు. 
 
బెంగళూరు: ఐపీఎల్‌–2018 కోసం జరిగిన వేలంలో రెండో రోజు కూడా ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి. ఇప్పటికే గుర్తింపు పొందిన ఆటగాళ్లతో పాటు కొత్తవాళ్లకు కూడా పెద్ద మొత్తం చెల్లించేందుకు సిద్ధమయ్యాయి. ఈ జాబితాలో ఉనాద్కట్, గౌతమ్‌ ముందు వరుసలో నిలిచారు. ఆస్ట్రేలియా పేస్‌ బౌలర్‌ ఆండ్రూ టైని పంజాబ్‌ జట్టు రూ.7.20 కోట్లకు గెలుచుకుంది. విదేశీ ఆటగాళ్లలో రెండో రోజు ఇదే అత్యధిక మొత్తం.

తొలి రోజు సన్‌రైజర్స్‌ తీసుకున్న రషీద్‌ ఖాన్‌తో పాటు మరో ముగ్గురు అఫ్గానిస్తాన్‌ ఆటగాళ్లకు కూడా ఐపీఎల్‌లో చోటు లభించగా... సందీప్‌ లిమిచానే ఈ లీగ్‌లో అడుగు పెడుతున్న తొలి నేపాల్‌ క్రికెటర్‌గా నిలవడం విశేషం. కోల్‌కతా జట్టు తమకు అందుబాటులో ఉన్న మొత్తం రూ. 80 కోట్లను పూర్తిగా వినియోగించుకోగా... చివర్లో ఆటగాళ్లను ఎంచుకోవడంలో గందరగోళానికి గురైన చెన్నై రూ.6.50 కోట్లను ఉపయోగించుకోలేక వృథా చేసుకుంది. ఎనిమిది జట్లలో కోల్‌కతా, పంజాబ్‌ గరిష్ట విదేశీ ఆటగాళ్లు (8)ను ఎంచుకోకుండా 7కే పరిమితమయ్యాయి. ఒక్కోజట్టు సభ్యుల సంఖ్య గరిష్టంగా 25 కాగా చెన్నై, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌ సరిగ్గా 25 మందిని తీసుకున్నాయి. బెంగళూరు (24), రాజస్తాన్‌ (23), పంజాబ్‌ (21), కోల్‌కతా (19) తక్కువ సంఖ్యకే తమ వేలాన్ని ముగించాయి.  

ఉనాద్కట్‌ కోసం పోటీ పడి...
స్వయంగా ఉనాద్కట్‌ కూడా కలలో ఊహించలేని విధంగా అతని కోసం వేలం సాగింది. రూ. 1.5 కోట్ల కనీస ధరతో అతను వేలంలోకి అందుబాటులోకి వచ్చాడు. అందరికంటే ముందుగా చెన్నై రేసులోకి వచ్చింది. అయితే ఆ తర్వాత పంజాబ్‌ వేలానికి సిద్ధమైంది. ఒకరితో మరొకరు పోటీ పడి విలువ పెంచేశారు. ఫలితంగా 4 కోట్లు... 5... 8... ఇలా పంజాబ్‌ 10 కోట్లకు తీసుకుపోయింది. చెన్నై 10.5 చెప్పినా మళ్లీ పంజాబ్‌ 11కు పెంచి ఆగిపోయింది. ఇక పంజాబ్‌కే ఖాయం అనిపించిన దశలో అనూహ్యంగా రాజస్తాన్‌ ముందుకొచ్చింది. రూ. 11.5 కోట్లకు సిద్ధమని ప్రకటించి ఉనాద్కట్‌ను సొంతం చేసుకుంది. నిజానికి ఉనాద్కట్‌ వేలానికి వచ్చే సమయానికి రాయల్స్‌ వద్ద మొత్తం 16.5 కోట్లు మాత్రమే మిగిలాయి.

కానీ ఆ జట్టు ఒక్క ఆటగాడి కోసం అందులో 70 శాతం మొత్తాన్ని ఖర్చు చేయడం అమితాశ్చర్యం కలిగించింది. గత ఏడాది పుణే తరఫున ఆడిన ఉనాద్కట్‌ హ్యాట్రిక్‌ సహా 7.02 ఎకానమీతో 24 వికెట్లు పడగొట్టి భువనేశ్వర్‌ (26) తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. గౌతమ్‌ కనీస ధర రూ. 20 లక్షలు కాగా... బెంగళూరు, కోల్‌కతాలతో పోటీ పడి రాయల్స్‌ చివరకు అతడిని తీసుకుంది. ఇది గౌతమ్‌ కనీస ధరకంటే 31 రెట్లు ఎక్కువ కావడం విశేషం. అంతర్జాతీయ టి20ల్లో భారత్‌పైనే 2 సెంచరీలు చేసిన ఎవిన్‌ లూయీస్‌ (వెస్టిండీస్‌) కోసం సన్‌రైజర్స్‌ ఆసక్తి చూపించినా, అతడిని ముంబై దక్కించుకుంది. ధోని ఫేవరెట్‌ మోహిత్‌ శర్మను చెన్నై రూ.2.4 కోట్లకు గెలుచుకోగా... రైట్‌ టు మ్యాచ్‌ కార్డు ద్వారా అతను పంజాబ్‌కు వెళ్లాల్సి వచ్చింది.  

ముచ్చటగా మూడోసారి...
విధ్వంసకర ఆటగాడిగా లెక్కలేనన్ని టి20 రికార్డులు తన పేరిట ఉన్న క్రిస్‌ గేల్‌ ఐపీఎల్‌ కెరీర్‌కు చివరకు పంజాబ్‌ ఊపిరి పోసింది. ఆదివారం రెండోసారి వేలంలో కూడా అతడిని ఎవరూ తీసుకోలేదు. మూడోసారి మాత్రం కనీస ధర రూ. 2 కోట్లకు కింగ్స్‌ ఎలెవన్‌ ఎంచుకోగా, మరే ఫ్రాంచైజీ పోటీ పడలేదు. శ్రీలంక తరఫున ఆఫ్‌ స్పిన్నర్‌ అఖిల ధనంజయ, ఆల్‌రౌండర్‌ దుష్మంత చమీరాలకు మాత్రమే ఐపీఎల్‌ అవకాశం లభించింది.   

మురళీ విజయ్‌ కూడా...
తొలి రోజు వేలంలో అమ్ముడుపోని భారత టెస్టు ఓపెనర్‌ మురళీ విజయ్‌కు రెండో రోజు అదృష్టం వెంట వచ్చింది. అతని సొంత నగరానికే చెందిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ కనీస ధర రూ. 2 కోట్లకు విజయ్‌ను ఎంచుకుంది. చెన్నైకి ఆ సమయంలో కచ్చితంగా ఒక భారత బ్యాట్స్‌మన్, అదీ ఓపెనర్‌ అవసరం ఉండటం కూడా విజయ్‌కు కలిసొచ్చింది. శనివారం ఎవరూ పట్టించుకోని పార్థివ్‌ పటేల్‌ (రూ.1.7 కోట్లు–బెంగళూరు), మిచెల్‌ జాన్సన్‌ (రూ. 2 కోట్లు – కోల్‌కతా) రెండోసారి మాత్రం ఎంపికయ్యారు.  

ఐపీఎల్‌లో బిర్లా వారసుడు
బిర్లా... ఈ పేరు వినగానే మన మదిలో అతి పెద్ద పారిశ్రామికవేత్త, అపార సంపద కలిగిన కోటీశ్వరుని పేరే మదిలో మెదులుతుంది! ఇప్పుడు అలాంటి బిర్లా కుటుంబ వారసుడు ఐపీఎల్‌లో అడుగు పెట్టబోతున్నాడు. ఐపీఎల్‌ రాకతో పేదలు ధనవంతులుగా మారిన కథలతో పోలిస్తే ఇది కాస్త భిన్నం. 20 ఏళ్ల ఆర్యమాన్‌ విక్రమ్‌ బిర్లా తాజా వేలంలో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టులోకి ఎంపికయ్యాడు. కుమార మంగళం బిర్లా కుమారుడే ఆర్యమాన్‌ కావడం విశేషం. రూ.20 లక్షల కనీస విలువతో ఆర్యమాన్‌ పేరు వేలంలోకి వచ్చింది.

రాజస్తాన్‌ అదే మొత్తానికి ముందుగా రాగా పంజాబ్‌ మరో ఐదు లక్షలు పెంచింది. అయితే ఆ తర్వాత రాయల్స్‌ రూ. 30 లక్షలకు ఆర్యమాన్‌ను సొంతం చేసుకుంది. ఎడమ చేతి ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ అయిన ఆర్యమాన్‌ మధ్యప్రదేశ్‌ తరఫున ఇటీవల తన ఏకైక రంజీ మ్యాచ్‌ ఆడాడు. కొన్నాళ్ల క్రితమే అండర్‌–23 సీకే నాయుడు టోర్నీలో 153 పరుగులతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ముంబై జట్టులో అవకాశాలు లభించడం కష్టంగా భావించి మధ్యప్రదేశ్‌కు తరలి వెళ్లిన ఆర్యమాన్‌... వ్యాపారంకంటే క్రికెట్‌ కెరీర్‌పైనే దృష్టి పెడుతున్నట్లు చెప్పాడు.   


సిరాజ్‌ అదే మొత్తానికి....
హైదరాబాద్‌ పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ ఈసారి కోహ్లి సారథ్యంలోని బెంగళూరు తరఫున బరిలోకి దిగనున్నాడు. గత ఏడాదిలాగే ఈసారి కూడా సిరాజ్‌ సరిగ్గా రూ. 2.6 కోట్ల ధర పలకడం విశేషం. 2017 ఐపీఎల్‌లో 6 మ్యాచ్‌లలో 10 వికెట్లు పడగొట్టిన సిరాజ్‌... ఆ తర్వాత భారత జట్టుకు కూడా ఎంపికై రెండు టి20లు ఆడి 2 వికెట్లు పడగొట్టాడు.

ఆదివారం వేలంలో సిరాజ్‌ కోసం వరుసగా కోల్‌కతా, ముంబై, చెన్నై, పంజాబ్‌ పోటీ పడినా... చివరకు బెంగళూరు అతడిని దక్కించుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఇతర ఆటగాళ్లలో తన్మయ్‌ అగర్వాల్‌ ఈసారి కూడా కనీస ధర (రూ. 20 లక్షలు)కు సన్‌రైజర్స్‌కే ఎంపికయ్యాడు. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ మెహదీ హసన్‌ను కూడా తొలిసారి రైజర్స్‌ ఎంచుకోవడం విశేషం. ఆంధ్ర క్రికెటర్లలో రికీ భుయ్‌ (రూ.20 లక్షలు) వరుసగా రెండోసారి రైజర్స్‌ తరఫున కొనసాగనున్నాడు.  

మరో ఇద్దరు...
అఫ్గానిస్తాన్‌ తరఫున గత ఏడాది ఐపీఎల్‌లో ఇద్దరు ఆటగాళ్లు బరిలోకి దిగారు. ఈసారి కూడా రషీద్‌ ఖాన్‌ (రూ. 9 కోట్లు), మొహమ్మద్‌ నబీ (రూ. 1 కోటి) హైదరాబాద్‌కే ఆడనున్నారు. వీరితో పాటు కొత్తగా మరో ఇద్దరు కూడా ఐపీఎల్‌లో అడుగు పెడుతుండటం విశేషం. ప్రస్తుతం అండర్‌–19 ప్రపంచ కప్‌ ఆడుతున్న ముజీబ్‌ జద్రాన్, జహీర్‌ ఖాన్‌ పక్తీన్‌లకు చోటు లభించింది.

17 ఏళ్ల ముజీబ్‌కు ‘మిస్టరీ స్పిన్నర్‌’గా గుర్తింపు ఉంది. ప్రధానంగా ఆఫ్‌ స్పిన్నర్‌ అయినా లెగ్‌ స్పిన్, గుగ్లీలు కలగలిపి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలడు. రెండు రోజుల క్రితం న్యూజిలాండ్‌పై 4 వికెట్లు తీసి అఫ్గాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన ముజీబ్‌ను పంజాబ్‌ ఏకంగా రూ. 4 కోట్లకు సొంతం చేసుకుంది. 19 ఏళ్ల జహీర్‌ ఖాన్‌ చైనామన్‌ బౌలర్‌. ఇటీవల వైవిధ్యమైన శైలి బౌలర్లకు డిమాండ్‌ కనిపిస్తున్న నేపథ్యంలో రూ. 20 లక్షలకు జహీర్‌ను ముంబై గెలుచుకుంది.  

                                               ముజీబ్, జహీర్‌

వీళ్లకు ఐపీఎల్‌ యోగం లేదు: ఇషాంత్‌ శర్మ, టైల్‌మిల్స్, ఫాల్క్‌నర్, హాజల్‌వుడ్, ఏంజెలో మాథ్యూస్, మోజెస్‌ హెన్రిక్స్, హషీం ఆమ్లా, నాథన్‌ లయన్, జో రూట్, డ్వేన్‌ స్మిత్, మెక్లీనగన్, లసిత్‌ మలింగ, డారెన్‌ స్యామీ, రాస్‌ టేలర్, మోర్నీ మోర్కెల్, తిసారా పెరీరా, ఇర్ఫాన్‌ పఠాన్, అశోక్‌ దిండా, వరుణ్‌ ఆరోన్‌.  

169 అమ్ముడుపోయిన మొత్తం ఆటగాళ్ల సంఖ్య
113 మొత్తం భారత ఆటగాళ్లు  
71 అన్‌క్యాప్డ్‌ భారత ఆటగాళ్లు  
56 మొత్తం విదేశీ ఆటగాళ్లు   
ఫ్రాంచైజీలు వెచ్చించిన మొత్తం రూ. 431 కోట్ల 70 లక్షలు 
 

► కోల్‌కతా ముగ్గురు భారత అండర్‌–19 ఆటగాళ్లను సొంతం చేసుకుంది. వీరిలో పేసర్లు కమలేశ్‌ నాగర్‌కోటి (రూ. 3.20 కోట్లు), శివమ్‌ మావి (రూ. 3 కోట్లు) భారీ మొత్తాలకు అమ్ముడుపోగా, శుభ్‌మాన్‌ గిల్‌కు రూ. 1.80 కోట్లు దక్కాయి.
► పంజాబ్‌ రూ. 20 లక్షలకు సొంతం చేసుకున్న మయాంగ్‌ డాగర్‌ సెహ్వాగ్‌కు స్వయానా మేనల్లుడు
► పంజాబ్‌ తీసుకున్న మంజూర్‌ దార్‌ లీగ్‌లో ఏకైక జమ్మూ కశ్మీర్‌ ఆటగాడు.
► చెన్నై జట్టులో ఏకంగా ఎనిమిది మంది అన్‌క్యాప్డ్‌ ఆటగాళ్లున్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

యువీ మళ్లీ చెలరేగాడు.. కానీ

చాంపియన్‌ రజత్‌ అభిరామ్‌

చెస్‌ విజేతలు లక్ష్మి, ధ్రువ్‌

వారియర్స్‌కు బుల్స్‌ దెబ్బ

భారత్‌ ‘ఎ’ ఘనవిజయం

ఫైనల్లో సాత్విక్‌ – చిరాగ్‌ జోడి

ఆసక్తికరంగా యాషెస్‌ టెస్టు

చెమటోడ్చి ఛేదన..!

కష్టపడి నెగ్గిన టీమిండియా..

విండీస్‌కు షాక్‌.. 5 వికెట్లు టపాటపా..!

భారత్‌-విండీస్‌ టి20; రాహుల్‌ ఔట్‌

‘కోచ్‌ వస్తున్న సంగతి సచిన్‌ చెప్పలేదు..’

ఫైనల్లో సాత్విక్‌ జోడి

కోహ్లిపై జోక్‌.. నెటిజన్లు ఫైర్‌

రాహుల్‌ ముంగిట ‘ఫాస్టెస్ట్‌’ రికార్డు

నేటి క్రీడా విశేషాలు

లియోనల్‌ మెస్సీపై నిషేధం!

క్రిస్‌ గేల్‌ మళ్లీ బాదేశాడు

‘పంత్‌.. నీకిదే మంచి అవకాశం’

మళ్లీ ‘బెయిల్స్‌’ గుబులు

ఆనాటి టీ20 మ్యాచ్‌ గుర్తుందా?

ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఫర్హార్ట్‌ సేవలు

విజేత నరేందర్‌

స్తుతిశ్రీకి 4 స్వర్ణాలు

సాయిప్రణీత్‌ నిష్క్రమణ

భారీ స్కోరు దిశగా ఇంగ్లండ్‌

టైటాన్స్‌ నాన్‌ టెక్నికల్‌ టై

ఆట మళ్లీ మొదలు

ఇదొక పనికిమాలిన చర్య: బ్రెట్‌ లీ

టీమిండియా కోచ్‌ అవుతా: గంగూలీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రైఫిల్‌ షూట్‌ పోటీల్లో ఫైనల్‌కు అజిత్‌

సింగిల్‌ టేక్‌లో చేయలేను..!

రష్మిక కోరికేంటో తెలుసా?

ఆర్టిస్ట్‌ బ్రావో!

యాక్షన్‌ అవార్డ్స్‌

శత్రువు లేని యుద్ధం