రాజస్తాన్‌ రాయల్స్‌ ప్రపోజల్‌కు కింగ్స్‌ నో!

30 May, 2020 16:49 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) నిర్వహణపై ఏమి చేద్దామనే విషయంలో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) తలలు పట్టుకుంటుంటే ఫ్రాంచైజీలు మరింత ఇరకాటంలోకి నెడుతున్నాయి. ఐపీఎల్‌ ఫ్రాంచైజీల మధ్య ఏకాభిప్రాయ లేకపోవడంతో ఐపీఎల్‌ నిర్వహణ ఎక్కడకు దారి తీస్తుందో బీసీసీఐ పెద్దలకు అంతు చిక్కడం లేదు. తాజాగా కింగ్స్‌ పంజాబ్‌ సహ యజమాని నెస్‌ వాడియా చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసేలా కనిపిస్తున్నాయి. విదేశీ క్రికెటర్లు లేకుండా ఐపీఎల్‌ను నిర్వహించడం సాధ్యం కాదని కుండ బద్ధలు కొట్టాడు. ఒకవైపు భారత ఆటగాళ్ల ద్వారానే ఐపీఎల్‌ను నిర్వహిద్దామనే ప్రపోజల్‌ను రాజస్తాన్‌ రాయల్స్‌ తీసుకురాగా, మరొకవైపు ఆ ప్రతిపాదనకు నెస్‌ వాడియా విముఖత వ్యక్తం చేశారు. (స్టోక్స్‌ కోసం ఏమైనా రూల్స్‌ మార్చారా?)

‘ఐపీఎల్‌ అనేది భారత్‌లో రూపాంతరం చెందిన ఇంటర్నేషనల్‌ టోర్నమెంట్‌. వరల్డ్‌లోనే అత్యుత్తమ క్రికెట్‌ లీగ్‌. దానికి ఇంటర్నేషనల్‌ ప్లాట్‌ఫామ్‌ కావాలి.. అంటే ఇంటర్నేషనల్‌ ఆటగాళ్లు ఉండాల్సిందే. కేవలం భారత క్రికెటర్లను మాత్రమే అనుమతిస్తూ ఐపీఎల్‌ నిర్వహిద్దామనే యోచిస్తున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ కూడా షెడ్యూల్‌ను ఫిక్స్‌ చేయడానికి తొందర పడుతున్నట్లే కనబడుతుంది. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్‌ నిర్వహణపై అప్పుడే ఒక నిర్ణయానికి రావొద్దు. రేపు ఎలా ఉంటుందో చెప్పలేం. కరోనా పాజిటివ్‌ కేసులు పెరగవనే గ్యారంటీ ఏమీ లేదు. ఒకవైపు కోవిడ్‌-19 వ్యాప్తి ఇంకా అలానే ఉండగా ఒక టోర్నీ నిర్వహణపై అప్పుడే తుది నిర్ణయానికి రాకండి. చాలామంది నిపుణులు జూలై-ఆగస్టు నెలల్లో కరోనా మరింత విస్తరించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఐపీఎల్‌పై నిర్ణయం తీసుకోవడానికి ఒక నెల నుంచి రెండు నెలల సమయం తీసుకుంటేనే మంచిది. కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టిన తర్వాతే ఐపీఎల్‌పై క్లారిటీకి రావడం ఉత్తమం. టోర్నీని ఎక్కడ నిర్వహించాలి.. ఎలా నిర్వహించాలి అనే దానిపై స్పష్టత రావాలంటే నిరీక్షణ తప్పదు’ అని నెస్‌ వాడియా తెలిపారు.(అందుకే స్మిత్‌ను గేలి చేశా: ఇషాంత్‌)

మరిన్ని వార్తలు