పాక్‌తో ఆడే ముచ్చటే లేదు: ఐపీఎల్‌ ఛైర్మన్‌

18 Feb, 2019 17:00 IST|Sakshi

ముంబై : దాయాది పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే అవకాశమే లేదని ఐపీఎల్‌ ఛైర్మన్‌ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడిపై  ఆయన స్పందించారు. ప్రభుత్వ అంగీకారం లేకుండా పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయంలో తమ వైఖరిపై స్పష్టత ఉందన్నారు. వాస్తవానికి క్రీడలకు ఈ పరిణామాలతో సంబంధం ఉండదని, కానీ ఎవరైనా ఉగ్రవాదానికి ఊతమిస్తున్నారంటే... దాని ప్రభావం కచ్చితంగా క్రీడలపై పడుతుందన్నారు. 
 
ఇంగ్లండ్‌ వేదికగా జరగబోయే ప్రపంచ కప్‌లో పాక్‌తో భారత్ ఆడుతుందా అన్న ప్రశ్నకు శుక్లా సమాధానం దాటవేశారు. ప్రస్తుతం దీనిపై ఏమీ చెప్పలేనన్నారు. ‘‘ప్రపంచకప్‌కు ఇంకా చాలా రోజుల సమయం ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం...’’అని పేర్కొన్నారు. పుల్వామా దాడితో యావత్‌ భారత్‌ పాకిస్తాన్‌పై రగిలిపోతున్న సంగతి తెలిసిందే. ఈ జనాగ్రహాన్ని సమర్ధించిన శుక్లా... ఉగ్రవాదానికి కొమ్ముకాయడం మానుకోవాలంటూ పాక్‌కు హితవు పలికారు. గత గురువారం(ఫిబ్రవరి14న) జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరగడంతో 40 మంది సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు