యువరాజ్‌పైనే అందరి దృష్టి

2 Jan, 2016 01:10 IST|Sakshi
యువరాజ్‌పైనే అందరి దృష్టి

* బరిలో హర్భజన్, నెహ్రా     
* నేటినుంచి ముస్తాక్ అలీ టి20 టోర్నీ

న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్ల విరామం తర్వాత భారత టి20 జట్టులో పునరాగమనం చేసిన యువరాజ్ సింగ్ అంతర్జాతీయ మ్యాచ్‌లకు ముందు దేశవాళీలో తన టి20 సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. శనివారం ప్రారంభం కానున్న ముస్తాక్ అలీ టోర్నీలో అతను పాల్గొంటున్నాడు. వన్డేల్లో చెలరేగడం ద్వారా టీమిండియాకు మళ్లీ ఎంపికైన యువీ... టి20ల్లో ఎలా ఆడతాడనేది ఆసక్తికరం. ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టు యువీని తప్పించడంతో ఫిబ్రవరిలో జరిగే వేలంలో మరో ఫ్రాంచైజీలకు అతను అందుబాటులోకి వస్తాడు.

ఆలోగా ముస్తాక్ అలీ టోర్నీతో పాటు ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌లలో రాణిస్తే యువీ మరో సారి వేలంలో స్టార్‌గా ముందు వరుసలో నిలిచే అవకాశం ఉంది. పైగా టి20 ప్రపంచకప్ కోసం కూడా అతని అవకాశాలు మెరుగవుతాయి. యువీతో పాటు భారత జట్టులోకి ఎంపికైన సీనియర్లు హర్భజన్ సింగ్, ఆశిష్ నెహ్రా కూడా తమ ప్రదర్శనను, ఫిట్‌నెస్‌ను అంచనా వేసేందుకు ఈ టోర్నీ ఉపయోగపడనుంది. వన్డేల్లో స్థానం కోల్పోయిన సురేశ్ రైనా కూడా తన ఫేవరెట్ ఫార్మాట్‌లో సత్తా చాటేందుకు సన్నద్ధమయ్యాడు.
 
కుర్రాళ్లకూ అవకాశం
ఐపీఎల్ వేలం ఫిబ్రవరిలో జరగనుంది. దానికి కాస్త ముందు హడావిడిగా కాకుండా ఈ సారి ముస్తాక్ అలీ ట్రోఫీ జనవరి 20నే ముగుస్తోంది. కాబట్టి దేశవాళీ యువ ఆటగాళ్లను తమ జట్టులోకి తీసుకోవాలని భావించే ఫ్రాంచైజీలకు వారి ఆటపై ఓ అభిప్రాయానికి వచ్చేందుకు తగినంత సమయం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో ప్రదర్శన కుర్రాళ్లకు కూడా కీలకం కానుంది. విజయ్ హజారే తరహాలోనే అన్ని జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. పాయింట్ల ప్రకారం టాప్-2 జట్లు క్వార్టర్స్‌కు చేరతాయి.
 
గ్రూప్ ఎ: హైదరాబాద్, బెంగాల్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, తమిళనాడు, విదర్భ
గ్రూప్ బి: రాజస్థాన్, పంజాబ్, కేరళ, జమ్మూ కశ్మీర్, సౌరాష్ట్ర, త్రిపుర, జార్ఖండ్
గ్రూప్ సి: ఆంధ్ర, మధ్యప్రదేశ్, అస్సాం, బరోడా, ఢిల్లీ, రైల్వేస్, గోవా
గ్రూప్ డి: ముంబై, ఒడిషా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, సర్వీసెస్

మరిన్ని వార్తలు