ఐపీఎల్‌ ఫైనల్‌: టికెట్ల గోల్‌మాల్‌

11 May, 2019 18:48 IST|Sakshi

ఐపీఎల్‌ ఫైనల్‌కు బ్లాక్‌ టికెట్ల దందా

రెట్టింపు ధర చెల్లిస్తామన్నా దొరకని పరిస్థితి

వెబ్‌సైట్లలో సోల్డ్‌  అవుట్‌ అని పెట్టి బ్లాక్‌లో అమ్ముకుంటున్న నిర్వాహకులు

టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్‌ చుట్టూ తిరుగుతున్న ఫ్యాన్స్‌

హైదరాబాద్:  ఐపీఎల్‌ ఫైనల్‌ చూడాలని ఉత్సాహంగా వచ్చే అభిమానులకు టికెట్ల గోల్‌మాల్‌ ఇబ్బందులుగా మారింది.  ఎలాగైనా ఫైనల్ మ్యాచ్‌ చూడాలని క్రికెట్ ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. దీనిని క్యాష్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న కేటు గాళ్లు బ్లాక్ టికెట్ల దందాను బహిరంగంగా మొదలెట్టేశారు. ఇక వెబ్‌సైట్లలో ఎలాంటి ముందుస్తు సమాచారం లేకుండానే కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే టికెట్లను అందుబాటులో ఉంచారు. అనంతరం సర్వర్‌ డౌన్‌ అయిందని బుకాయించిన నిర్వాహకులు.. వెంటనే సోల్డ్‌ ఔట్‌ అని పెట్టేశారు. ఇక ఆ కొద్ది నిమిషాల్లో టికెట్లు బుక్ చేసుకున్నవారు  జింఖానా గ్రౌండ్స్‌కు వచ్చి టికెట్లు తీసుకోవడానికి దాదాపు ఐదు గంటలకు పైగా క్యూ లైన్లలో పడిగాపులు పడుతున్నారు. 

ఇక అన్ని సైట్లలలో టికెట్స్‌ సోల్డ్ ఔట్ దర్శనమిస్తున్నప్పటికీ బ్లాక్‌లో మాత్రం టికెట్ల దందా జోరుగా సాగుతోంది. టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్స్, ఉప్పల్ స్టేడియం చుట్టూ క్రికెట్ ఫ్యాన్స్ చక్కర్లు కొడుతున్నారు. స్టేడియం వెలుపల రూ. 2 వేల టికెట్లను బ్లాక్‌లో రూ.5 వేల నుంచి రూ. 6 వేల వరకు అమ్ముతున్నారని అభిమానులు పేర్కొంటున్నారు. 

దాదాపు 36 వేల సిట్టింగ్ కెపాసిటీ ఉన్న ఈ స్టేడియంలో దాదాపు 15వేల టికెట్ల వరకు స్పాన్సర్లు, బీసీసీఐ, ఇతర రాష్ట్రాల క్రికెట్‌ బోర్డులకు కేటాయిస్తారు. అయితే మిగిలిన 21వేల టికెట్ల అమ్మకంలో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) పారదర్శకత పాటించడం లేదని అభిమానులు మండిపడుతున్నారు. ఇందులో కూడా కామన్‌ టికెట్లనే బ్లాక్‌ చేశారని.. ఎక్కువ ధర టికెట్లను మాత్రమే అమ్మారని.. ప్రస్తుతం అవి కూడా దొరకని పరిస్థితికి అధికారులు తీసుకొచ్చారని ఫ్యాన్స్‌ వాపోయారు. 

అనుకోకుండా అందివచ్చిన అవకాశాన్ని క్యాష్‌ చేసుకోవాలని హెచ్‌సీఏ చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగ రేపు ఐపీఎల్‌ ఫైనల్‌లో భాగంగా డిపెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మాజా చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌ కోసం పటిష్ట భద్రతను ఏర్పాటు చేసామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు