ఐపీఎల్‌లో తొలిసారి..

22 Mar, 2018 12:51 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇప్పటివరకూ అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లకే పరిమితమైన అంపైర్‌ నిర్ణయ సమీక్షా పద్ధతి(డీఆర్‌ఎస్‌)ను ఇక నుంచి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో చూడబోతున్నాం.  దీనిపై గత కొంతకాలంగా జరుగుతున్న చర్చకు ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా ఎట్టకేలకు ముగింపు పలికారు. వచ‍్చే సీజన్‌ ఐపీఎల్‌లో డీఆర్‌ఎస్‌ను ప్రవేశపెట్టబోతున్న విషయాన్ని శుక్లా ధృవీకరించారు. ఫలితంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ చరిత్రలో డీఆర్‌ఎస్‌ విధానం తొలిసారి ప్రవేశపెట్టబోతున్నట్లయ్యింది.


'ఐపీఎల్‌లో డీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టే ఆలోచన ఎప్పటినుంచో ఉంది. దాన్ని ఈసారి అమలుచేయబోతున్నాం' అని శుక్లా తెలిపారు. అయితే ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ-చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని మాత్రమే ఐపీఎల్‌ ఆరంభ వేడుకులకు రావడంపై శుక్లా వివరణ ఇచ్చారు. అందరు కెప్టెన్లు వేడుకలకు రావడం వల్ల మరుసటి రోజు మ్యాచ్‌లకు హాజరయ్యే విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. అందుకే  మొదటి మ్యాచ్‌ కెప్టెన్లు మినహా మిగతా జట్ల కెప్టెన్లను ప్రారంభ వేడుకలకు దూరం పెట్టామన్నారు.

గతేడాది పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)లో భాగంగా ప్లే ఆఫ్‌ స్టేజ్‌ మ్యాచ్‌లకు డీఆర్‌ఎస్‌ను ఉపయోగించారు. తద్వారా టీ 20 టోర్నమెంట్‌లలో తొలిసారి డీఆర్‌ఎస్‌ను ఉపయోగించిన ఘనత పీఎస్‌ఎల్‌ దక్కించుకుంది. ఇక 2017 అక్టోబర్‌లో అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌ల్లో డీఆర్‌ఎస్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు