రహానే వర్సెస్ భువనేశ్వర్..

9 Apr, 2018 12:34 IST|Sakshi
అజింక్యా రహానే, భువనేశ్వర్ కుమార్ (ఫైల్ ఫొటో)

సాక్షి, హైదరాబాద్ : ఐపీఎల్ 11లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో నేటి రాత్రి జరగనున్న మ్యాచ్‌ కోసం ఆతిథ్య జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్ సన్నద్ధమైంది. అయితే నేటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ అజింక్యా రహానేల మధ్య పోరుగా ఆతిథ్య జట్టు భావిస్తోంది. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ఆరుసార్లు పేసర్ భువీ బౌలింగ్‌లో రహానే వికెట్ సమర్పించుకున్నాడని, నేటి రాత్రి మరోసారి వికెట్ తీసి ఏడో పర్యాయం సక్సెస్ అవుతాడా.. ఆరెంజ్ ఆర్మీ ఏం చేస్తుందో చూద్దామంటూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. 

ఓ వైపు స్టీవ్‌ స్మిత్‌పై వేటు పడటంతో కెప్టెన్‌గా రహానేకు రాజస్తాన్ పగ్గాలు అప్పగించారు. అసలే రెండేళ్ల నిషేధం తర్వాత పునరాగమనం చేస్తున్న జట్టుకు కెప్టెన్‌గా చేయడమన్న టెన్షన్‌తో పాటు హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ విజయాలు రహానేకు కాస్త ప్రతికూలమైన అంశాలుగా కనిపిస్తున్నాయి. ఉప్పల్ స్డేడియంలో సన్‌రైజర్స్ 30 మ్యాచ్‌లకుగానూ 20 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. అయితే ఇక్కడ జరిగిన నాలుగు మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్‌లు నెగ్గడం రహానే సేనపై ఒత్తిడి తగ్గించే చాన్స్ ఉందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. అభిమాన ఆటగాళ్లు శిఖర్‌ధావన్, యూసుఫ్‌ పఠాన్, భువనేశ్వర్, అలెక్స్‌ హేల్స్‌పై హైదరాబాదీలు ఆశలు పెట్టుకున్నారు. ఈసారి అంతా యంగ్‌ ప్లేయర్స్‌నే ఉండడంతో కప్‌ గెలుస్తుందనే ధీమా సన్‌రైజర్స్‌ అభిమానుల్లో ఉంది. 

వరుణుడు కరుణించేనా?
నగరంలో గత రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో సోమవారం కూడా భారీ ఈదురుగాలులు వీచే, వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే భారీ వర్షం వస్తే తప్ప.. మ్యాచ్‌ రద్దయ్యే అవకాశం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. వర్షం వస్తే పిచ్‌ తడవకుండా ఉండేందుకు స్టేడియం సిబ్బంది పనుల్లో నిమగ్నమయ్యారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మ్యాచ్‌ జరుగుతుందా? లేదా? సందిగ్ధంలోఅభిమానులున్నారు.

మరిన్ని వార్తలు