మే 12న  ఐపీఎల్‌ ఫైనల్‌ 

20 Mar, 2019 00:15 IST|Sakshi

పూర్తి షెడ్యూల్‌ విడుదల చేసిన బీసీసీఐ  

ముంబై: ఐపీఎల్‌–2019 తుది పోరుకు చెన్నై వేదిక కానుంది. ఇక్కడి చిదంబరం స్టేడియంలో మే 12న ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహిస్తారు. దేశంలో ఎన్నికల దృష్ట్యా గత నెల 19న తొలి రెండు వారాల షెడ్యూల్‌ను (17 మ్యాచ్‌లు) మాత్రమే ప్రకటించింది. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్‌ అనంతరం అన్ని వేదికల్లో మ్యాచ్‌ల నిర్వహణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటూ లీగ్‌ దశలో మిగిలిన 39 (మొత్తం 56) మ్యాచ్‌ల తేదీలను వెల్లడించింది. దీని ప్రకారం మే 5 వరకు లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి.

ఎప్పటిలాగే ఇంటా, బయటా పద్ధతిలో ప్రతీ జట్టు 14 మ్యాచ్‌లు ఆడుతుంది. ప్లే ఆఫ్‌ తేదీలను బోర్డు ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా... మే 7, 8, 10 తేదీల్లో జరగవచ్చని బీసీసీఐలోని విశ్వసనీయవర్గాల సమాచారం. ప్రస్తుత షెడ్యూల్‌ ప్రకారం ఏదైనా వేదికలో ఏవైనా అనుకోని కారణాల వల్ల మ్యాచ్‌ నిర్వహణ కష్టంగా మారితే ప్రత్యామ్నాయ వేదికగా వైజాగ్‌ను నిర్వాహకులు ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. మ్యాచ్‌ల సమయాల్లో కూడా ఎలాంటి మార్పు లేకుండా సాయంత్రం 4 గంటలకు, రాత్రి 8 గంటలకే ప్రారంభమవుతాయి. ఈ నెల 23న చెన్నైలో చెన్నై సూపర్‌ కింగ్స్, బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్‌ 12వ సీజన్‌ మొదలవుతుంది.  

హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌లివే... 
సన్‌రైజర్స్‌ హోం గ్రౌండ్‌ హైదరాబాద్‌లోని ఉప్పల్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఎప్పటిలాగే 7 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. సన్‌రైజర్స్‌తో మిగిలిన ఏడు జట్లు ఈ మ్యాచ్‌లలో తలపడతాయి.   

>
మరిన్ని వార్తలు