మా క్రికెట్‌ స్థాయిని పెంచిన లీగ్‌ అదే: బట్లర్‌

23 May, 2020 15:23 IST|Sakshi

వరల్డ్‌కప్‌ తర్వాత బెస్ట్‌ లీగ్‌

ఆ లీగ్‌ ఆడితే భలే మజా ఉంటుంది

న్యూఢిల్లీ:  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)పై ఇంగ్లండ్‌ క్రికెటర్‌ జోస్ బట్లర్‌ ప్రశంసలు కురిపించాడు. క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన లీగ్‌ అదేనంటూ కొనియాడాడు. ప్రత్యేకంగా తమ క్రికెట్‌ మరింత మెరుగుపడటానికి ఐపీఎల్‌ ఎంతగానో దోహదపడిందన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) నిర్వహించే వరల్డ్‌కప్‌ తర్వాత బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్‌ టోర్నీనే తాను చూసిన వాటిలో ఉత్తమం అని పేర్కొన్నాడు. ‘ఐపీఎల్‌ మా క్రికెటర్లకు ఎంతగానో సాయ పడిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంగ్లండ్‌ నుంచి చాలా మంది క్రికెటర్లు ఐపీఎల్‌ ఆడుతూ తమ కెరీర్‌కు బాటలో వేసుకున్నారు. ఐపీఎల్‌ ఆడటాన్ని గౌరవంగా భావిస్తా. నా వరకూ చూస్తే ఇదొక బెస్ట్ టోర్నమెంట్‌. వరల్డ్‌కప్‌ తరహాలో ఐపీఎల్‌కు కూడా మంచి క్రేజ్‌ ఉంది. (ఇది నిజమా.. ఇంతకంటే దారుణం ఉండదు)

ఐపీఎల్‌ కొన్ని మ్యాచ్‌లు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. అది భలే మజాగా ఉంటుంది. ఐపీఎల్‌ టాప్‌-3 జట్లలో బెంగళూరు(ఆర్సీబీ) ఒకటి. విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌ వంటి స్టార్‌లు ఉన్నారు. ఇక కోహ్లికి, ఏబీ డివిలియర్స్‌కు, క్రిస్‌ గేల్‌కు పోటీగా జస్‌ప్రీత్‌ బుమ్రా, డేల్‌ స్టెయిన్‌, మలింగా వంటి బౌలర్లు కూడా ఉన్నారు. తాను క్రికెట్‌ను ఎలా ఆస్వాదిస్తూ పెరిగానో, అదే తరహా క్రికెట్‌ను ఇప్పుడు చూస్తున్నానన్నాడు. ఒక ఫాంటసీ క్రికెట్‌ను చూడాలనుకున్నానని, ఇప్పుడు మిక్స్‌డ్‌ క్రికెటర్లతో అది మనమందు కనిపిస్తుందన్నాడు. వేర్వేరు దేశానికి చెందిన క్రికెటర్లు ఒకే జట్టులో ఉండి ఆడటం మంచి స్నేహపూర్వక వాతావారణానికి నిదర్శనమని బట్లర్‌ పేర్కొన్నాడు. ఈ సీజన్‌ ఐపీఎల్‌ కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నీ ఎప్పుడు జరుగుతుందనే దానిపై క్లారిటీ లేదు. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం మార్చి 29వ తేదీన ఆరంభం కావాల్సిన ఈ లీగ్‌.. వాయిదా పడింది. ఒకవేళ పరిస్థితులు అనుకూలిస్తే సెప్టెంబర్‌-అక్టోబర్‌లో ఈ లీగ్‌ జరిగే అవకాశం ఉంది. అది కూడా టీ20 వరల్డ్‌కప్‌ వాయిదా పడితేనే ఐపీఎల్‌ నిర్వహణ సాధ్యమవుతుంది. (మమ్మల్ని ఆడనివ్వండి.. నిజాయితీగా ఉండండి)

మరిన్ని వార్తలు