ఐపీఎల్‌ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోవద్దు

5 Apr, 2019 03:45 IST|Sakshi

ముంబై: వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేసే అంశంపై భారత క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పలు అభిప్రాయాలు వెలిబుచ్చాడు. తాజా ఐపీఎల్‌ ప్రదర్శనల ఆధారంగా కాకుండా గత నాలుగేళ్లలో ఆటగాడి ఫామ్, ప్రతిభను పరిగణలోకి తీసుకొని జట్టును ఎంపిక చేస్తే బాగుంటుందని అన్నాడు. ఐపీఎల్‌ ప్రదర్శనను ప్రామాణికంగా తీసుకొని వన్డే జట్టు ఎంపిక చేయడం తగదన్నాడు. ‘50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆడే జట్టు కోసం... 20 ఓవర్ల ఫార్మాట్‌పై ఆధారపడటం సరికాదేమో.

ఈ నాలుగేళ్లలో మేం చాలా వన్డేలాడాం. ఆ ప్రదర్శనల్ని పరిగణలోకి తీసుకొని జట్టును ఎంపిక చేస్తే బాగుంటుంది’ అని వివరించాడు.  నిజం చెప్పాలంటే ప్రపంచ కప్‌ కోసం భారత జట్టులో ఒకటి రెండు స్థానాలు మినహా మిగతా జట్టంతా ఖరారు అయినట్లేనని రోహిత్‌ తెలిపాడు. ‘మా జట్టు కూర్పు సిద్ధంగానే ఉంది. మిగతా ఒకట్రెండు స్థానాలపై కూ డా తొందరలోనే స్పష్టత వస్తుంది. ఇంగ్లండ్‌ పరిస్థితులను బట్టి అదనపు బ్యాట్స్‌మన్‌ను ఎంపిక చేయాలా? లేక అదనపు సీమర్, స్పిన్నర్‌ని తీసుకెళ్లాలా అనేది సెలక్టర్లు  నిర్ణయిస్తారు’ అని రోహిత్‌ వివరించాడు.     

>
మరిన్ని వార్తలు