ఐపీఎల్, సీఎల్ లబ్ధిదారుల వివరాలు అందించండి

17 Dec, 2014 00:30 IST|Sakshi

బీసీసీఐకి సుప్రీం కోర్టు ఆదేశం
 న్యూఢిల్లీ: ఐపీఎల్, చాంపియన్స్ లీగ్‌తో లాభం పొందుతున్న బోర్డు పరిపాలకులు, ఆటగాళ్ల జాబితాను తమ ముందుంచాలని సుప్రీం కోర్టు బీసీసీఐని కోరింది. పాలనాధికారిగా ఉండడంతో పాటు ఐపీఎల్, సీఎల్‌లో జట్టును కలిగి ఉండవచ్చనేవివాదాస్పద నిబంధనపై బోర్డు వాదనలు వినిపిస్తున్న సమయంలో కోర్టు ఈ సూచన చేసింది.

‘బీసీసీఐ అధికారులు లీగ్‌లో జట్లను కలిగి ఉండకపోతే స్వర్గమేమీ కూలిపోదు. ఒకవేళ బోర్డు అధ్యక్షుడికి సొంత ఫ్రాంచైజీ లేకపోతే మొత్తం ఐపీఎల్ ప్రాజెక్ట్ కుప్పకూలిపోదు. ఎలాంటి వాణిజ్యపరమైన లాభాలు లేకపోతే ఈ లీగ్ ప్రారంభమయ్యేదే కాదు. అధికారులతో పాటు ఇతరుల జాబితాను మాకు ఇవ్వండి’ అని జస్టిస్ టీఎస్ ఠాకూర్, కలీఫుల్లాలతో కూడిన బెంచ్ తెలిపింది. 6.2.4 నిబంధనను మార్చకపోతే జట్లను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు వచ్చేవారు కాదని బోర్డు కౌన్సిల్ సీఏ సుందరం వాదనను కోర్టు తోసిపుచ్చింది. అసలు ఏ ఉద్దేశంతో ఆ నిబంధనను మార్చారో తెలుసుకోవాల్సిన అవసరం ఈ దేశ ప్రజలకు ఉందని కోర్టు అభిప్రాయపడింది.
 
 రూ.425 కోట్లపై ఈడీ దర్యాప్తు
 ఐపీఎల్ మీడియా హక్కుల విషయంలో చేతులు మారిన రూ.425 కోట్ల ‘అసలు లబ్ధిదారులు’ ఎవరనేది ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) పరిశోధిస్తున్నట్టు పార్లమెంట్‌లో కేంద్రం తెలిపింది.
 

మరిన్ని వార్తలు