ఐపీఎల్‌తో ఎదుగుతా

11 Apr, 2014 01:09 IST|Sakshi
పర్వేజ్ రసూల్

సన్‌రైజర్స్ ఆటగాడు రసూల్ విశ్వాసం

న్యూఢిల్లీ: క్రికెటర్‌గా తన ఎదుగుదలకు ఐపీఎల్ చక్కని వేదిక కాగలదని జమ్మూ కాశ్మీర్ ఆల్‌రౌండర్ పర్వేజ్ రసూల్ అన్నాడు. తొలిసారిగా గత ఏడాది ఐపీఎల్-6లో పుణె వారియర్స్‌కు ఎంపికైన రసూల్.. ఆ రాష్ట్రం నుంచి ఐపీఎల్‌లో చోటు దక్కించుకున్న తొలి క్రికెటర్‌గా  రికార్డులకెక్కాడు. అయితే కేవలం రెండు మ్యాచ్‌లకు మాత్రమే తుదిజట్టులో అతనికి స్థానం దక్కింది.

 ఆ తరువాత కోహ్లి సారథ్యంలో జింబాబ్వే పర్యటనకు భారత జట్టుకు ఎంపికైనా ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం అతనికి రాలేదు. కానీ, ఈ విషయంలో తనకు ఎటువంటి నిరాశ లేదని, జట్టుకు ఎంపికవడం, సీనియర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకొనే అవకాశం రావడమే అదృష్టంగా భావిస్తున్నానని రసూల్ అన్నాడు. ఇక ఈసారి  సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనుండటంతో ఐపీఎల్-7 ద్వారా తనను తాను నిరూపించుకునే అవకాశం రానుందని చెబుతున్నాడు.


 ‘వచ్చిన అవకాశాలను  సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగడంపైనే దృష్టి నిలిపాను. క్రికెటర్‌గా నా ఎదుగుదలకు ఐపీఎల్ చక్కని వేదిక కాగలదు. సన్‌రైజర్స్ జట్టులోని జాతీయ, అంతర్జాతీయ స్టార్లతో కలిసి ఆడనుండటం కచ్చితంగా అందుకు దోహదపడేదే’ అని 25 ఏళ్ల రసూల్ అన్నాడు. ఇక యువరాజ్ విషయంలో అభిమానుల తీరును అతడు ఖండించాడు.

మరిన్ని వార్తలు