ఐపీఎల్‌ విజేత చెన్నై; ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు

28 May, 2018 09:33 IST|Sakshi

ముంబై: మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణల నేపథ్యంలో రెండేళ్ల నిషేధం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు ఐపీఎల్‌ 2018 విజేతగా నిలిచింది. ‘మిస్టర్‌ కూల్‌’  ఎంఎస్‌ ధోనీ నాయకత్వంలోని జట్టుకు ఇది మూడో ట్రోఫీ. ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ధోనీ సేన 8 వికెట్ల తేడాతో గెలుపొంది కప్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంలో షేన్‌ వాట్సన్‌(57 బంతుల్లో 117) వీరబాదుడుకు తోడు మరో సెంటిమెంట్‌ కూడా కలిసొచ్చిందని చెన్నై సారధి చెప్పుకొచ్చాడు.

నంబర్‌ 7: ‘‘ఫైనల్స్‌ అన్నాక ప్రతి ఒక్కరూ రకరకాల గణాంకాలను వల్లెవేస్తుంటారు. నా వరకైతే నంబర్‌ 7 సెంటిమెంట్‌ కీలకంగా అనిపించింది. ఇవాళ తేదీ మే 27. సాధించాల్సిన స్కోరు 179, నా జెర్సీ నంబర్‌ కూడా 7. అన్నింటికంటే మించి చెన్నై టీమ్‌ ఫైనల్స్‌కు రావడం ఇది 7వసారి. అన్ని చోట్లా 7 ఉంది. అలా కలిసొచ్చింది(నవ్వులు). అఫ్‌కోర్స్‌, సెంటిమెంట్ల సంగతి ఎలా ఉన్నా టీమ్‌ పెర్ఫామెన్స్‌ అనేది విజయానికి అతి ప్రధానం’’ అని చెప్పాడు ధోని.

ప్యాడ్స్‌ కట్టుకోవద్దని చెబుతా: కీలకమైన ఫైనల్స్‌లో చెన్నై ఓపెనర్‌ ఫ్యాప్‌ డుప్లిసిస్‌(10) స్కోరుకే అవుటయ్యాడు. అప్పటికే డ్వేన్‌ బ్రేవో ప్యాడ్లు కట్టుకుని సిద్ధమైపోవడంతో వన్‌ డౌన్‌లో అతనే వస్తాడేమో అనిపించింది. కానీ ఆర్డర్‌ ప్రకారం రైనానే వచ్చాడు. దీనిపై ధోనీ వివరణ ఇస్తూ.. ‘‘బ్రేవోని సిద్ధంగా ఉండమని నేనేమీ చెప్పలేదు. తనంతట తానే ప్యాడ్స్‌ కట్టుకుని రెడీ అయిపోయాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు చేయాలని అనుకోనేలేదు. ఈసారి అలా ప్యాడ్స్‌ కట్టుకోవద్దని బ్రేవోని చెబుతా..’’ అని ధోనీ చమత్కరించాడు.

నేడు చెన్నైకి..: ఈ సీజన్‌లో సొంతగడ్డపై ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడిన సూపర్‌ కింగ్స్‌ జట్టు సోమవారం చెన్నైకి వెళ్లనుంది. గెలిచినా, ఓడినా చెన్నై వెళ్లి అభిమానుల్ని కలుసుకోవాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లు ధోనీ చెప్పాడు. కావేరీ ఆందోళనల నేపథ్యంలో సీఎస్‌కే హోం గ్రౌండ్‌ చెన్నై నుంచి పుణెకు బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఇక హైదరాబాద్‌ బౌలర్లు రషీద్‌, భువీలపై ధోనీ ప్రశంసలు కురిపించాడు. ‘‘మిస్టరీ బౌలర్‌ రషీద్‌లాగే భువనేశ్వర్‌ కూడా చాలా తెలివైన బౌలర్‌. కాబట్టి ప్రత్యర్థి జట్టులో మమ్మల్ని ఇబ్బందిపెట్టేవారు ఒకరికంటే ఎక్కువే ఉన్నారు. అయితే వాట్సన్‌ స్టన్నింగ్‌ ఇన్నింగ్స్‌ మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేసింది’’ అని మిస్టర్‌ కూల్‌ వివరించాడు.

మ్యాచ్‌ రిపోర్ట్‌: ఆదివారం జరిగిన ఫైనల్లో చెన్నై 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. కేన్‌ విలియమ్సన్‌ (36 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), యూసుఫ్‌ పఠాన్‌ (25 బంతుల్లో 45 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం చెన్నై 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఐపీఎల్‌ ఫైనల్లో ఛేదనలో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా వాట్సన్‌ గుర్తింపు పొందగా, సురేశ్‌ రైనా (24 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్‌) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 57 బంతుల్లోనే 117 పరుగులు జోడించడం విశేషం.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు