ఎవరో ‘కప్‌’ సుల్తాన్‌! 

27 May, 2018 01:28 IST|Sakshi

ముంబైలో నేడు ఐపీఎల్‌–11 ఫైనల్‌

చెన్నై సూపర్‌ కింగ్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అమీతుమీ

రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం  

47 రోజులపాటు హోరాహోరీ పోరాటాలు...లీగ్, ప్లే ఆఫ్‌ సహా 59 మ్యాచ్‌లు...8 జట్లు... 100 మందిపైగా ఆటగాళ్లు...4 శతకాలు... 101 అర్ధ శతకాలు...1,621 బౌండరీలు... 853 సిక్సర్లు...మైమరిపించిన ఫీల్డింగ్‌ విన్యాసాలు...ఔరౌరా అనిపించిన క్యాచ్‌లు...కళ్లు చెదరగొట్టిన మెరుపు ఇన్నింగ్స్‌లు...ఉత్కంఠతో కుదిపేసిన ఛేదనలు...కట్టిపడేసిన బౌలింగ్‌ మాయాజాలాలు...ఊహకందని సారథుల వ్యూహాలు...మైదానంలో రంగురంగుల హంగులు...చీర్‌ లీడర్ల నృత్యాల హొయలు...నరనరాన అభిమానం నింపుకొన్న  ప్రేక్షక గణాలు...నగర నగరాన జన సందోహ నీరాజనాలు...51వ రోజున 60వ మ్యాచ్‌...ట్రోఫీని ముద్దాడేందుకు  ఒకే ఒక్క విజయం...ముంబైలో మహా సంగ్రామం... నేడే... ఐపీఎల్‌–11 తుది సమరం...  

ముంబై: సారథే మనోబలంగా బరిలో అదరగొట్టిన చెన్నై సూపర్‌ కింగ్స్‌... నాయకుడు వేసిన బాటలో నెగ్గుకొచ్చిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌... ముంబైలోని వాంఖెడే మైదానం వేదికగా ఆదివారం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 11వ సీజన్‌ ట్రోఫీ కోసం తుది సమరంలో తలపడనున్నాయి. పునరాగమనంలోనూ ఘనమైన రికార్డును నిలబెట్టుకుంటూ ఫైనల్‌ చేరిన ధోని జట్టు, అసలు అంచనాలే లేని స్థితి నుంచి అద్భుతంగా పైకెదిగిన విలియమ్సన్‌ సేన. ఎవరు గెలిచినా ఈ సీజన్‌కది ప్రత్యేక ముగింపే. ప్రస్తుత గణాంకాల ప్రకారం చూస్తే రెండు లీగ్‌ మ్యాచ్‌లు, మొదటి క్వాలిఫయర్‌లో హైదరాబాద్‌పై చెన్నైదే పైచేయి. తక్కువ స్కోర్లను కాపాడుకుంటూ, భారీ లక్ష్యాలను అందుకుంటూ మిగతా ప్రత్యర్థులందరినీ చుట్టేసిన సన్‌రైజర్స్‌కు... సూపర్‌ కింగ్స్‌ ఒక్కటే కొరకరాని కొయ్యగా మిగిలింది. బ్యాట్స్‌మెన్‌ అనూహ్య ఇన్నింగ్స్‌లు, ఆల్‌రౌండర్ల అండ, బౌలర్ల నిలకడతో దుర్భేద్యంగా ఉన్న చెన్నైని ఓడించాలంటే హైదరాబాద్‌ సమష్టిగా శక్తికి మించి ఆడాల్సిందే. 

‘ఒక్కరి’తోనే పడుతోంది దెబ్బ... 
భీకర బౌలింగ్‌ వనరులున్నప్పటికీ ప్రత్యర్థి జట్టులో ఎవరో ఒక బ్యాట్స్‌మన్‌ అసాధారణంగా ఆడుతుండటంతో సూపర్‌ కింగ్స్‌ను సన్‌రైజర్స్‌ లొంగదీసుకోలేకపోతోంది. లీగ్‌ మ్యాచ్‌లలో రెండుసార్లూ అంబటి రాయుడు దెబ్బ కొట్టగా, క్వాలిఫయర్‌లో ఆ పనిని డు ప్లెసిస్‌ చేశాడు. సమ ఉజ్జీలైన రెండు జట్ల మధ్య ఈ మూడు ఇన్నింగ్స్‌లే తేడా చూపాయి. ప్రణాళికతో ముందునుంచే అప్రమత్తం అయితే ఫైనల్లోనూ ఇలా జరగకుండా చూసుకోవచ్చు. కీలకమైన వాట్సన్, రాయుడితో పాటు రైనా, డు ప్లెసిస్‌లను త్వరగా ఔట్‌ చేస్తే చెన్నై జోరును తగ్గించినట్లవుతుంది. ధోని, బ్రేవోలపైకి రషీద్‌ ఖాన్‌ను ప్రయోగించి ఫలితం రాబట్టొచ్చు. అయితే, ఎప్పటిలానే హైదరాబాద్‌ బ్యాటింగ్‌ సామర్థ్యం మరోసారి ప్రశ్నార్థకంగా నిలుస్తోంది. శుక్రవారం క్వాలియఫర్‌–2లో రషీద్‌ ఇన్నింగ్స్‌ లేకుంటే కథ అక్కడితోనే ముగిసిపోయేది. దీంతోపాటు తుది జట్టు కూర్పుపైనా దృష్టి పెట్టాల్సి ఉంది. తీవ్రంగా నిరాశ పరుస్తున్న మనీశ్‌ పాండేను కాదని దీపక్‌ హుడాను, పేసర్‌ సందీప్‌ శర్మ స్థానంలో ఖలీల్‌ అహ్మద్‌ను, కీపర్‌ గోస్వామి బదులు వృద్ధిమాన్‌ సాహాను ఆడించి గత మ్యాచ్‌కు ఏకంగా మూడు మార్పులతో బరిలో దిగింది. ఈ మూడు ప్రయోగాలు పెద్దగా ఫలించలేదు. ఓపెనర్‌గా సాహా ఫర్వాలేదనిపించినా కీపింగ్‌లో విఫలమయ్యాడు. ఈసారి పోటీ చెన్నైతో కాబట్టి ధావన్‌తో పాటు ఓపెనింగ్‌కు దిగేదెవరో చూడాలి. లీగ్‌ దశలో బ్యాటింగ్‌ భారాన్నంతా మోసిన కెప్టెన్‌ విలియమ్సన్‌ రెండు ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. ఫైనల్లో రాణించి కప్‌ అందిస్తే అతడికి ఈ సీజన్‌ మరపురానిదిగా మిగిలిపోతుంది. యూసుఫ్‌ పఠాన్‌ ఓ మంచి ఇన్నింగ్స్‌ ఆడాల్సిన అవసరం ఉంది. ఆల్‌రౌండర్లు షకీబ్, బ్రాత్‌వైట్, బౌలర్లు భువనేశ్వర్, సిద్ధార్థ్‌ కౌల్, రషీద్‌ ఇప్పటివరకు నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. సందీప్‌ శర్మ మళ్లీ తుది జట్టులోకి రావొచ్చు. స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ కావాలనుకుంటే హుడా స్థానంలోకి పాండే వస్తాడు. 

సమృద్ధిగా వనరులు... 
నమ్మదగిన ఓపెనర్లు, ఎలాంటి మ్యాచ్‌నైనా అనుకూలంగా ముగించగల కెప్టెన్, అతడికి తోడుగా నిలకడైన ఆల్‌రౌండర్లు, పదునైన పేసర్లు, పదో నంబరు వరకు బ్యాటింగ్‌ చేయగల ఆటగాళ్లు... ఇలా ఏ విధంగా చూసినా చెన్నై పెద్ద పర్వతంలా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో బిల్లింగ్స్‌ను కాదని డు ప్లెసిస్‌కు చోటివ్వడాన్ని మొదట అందరూ తప్పుబట్టారు. కానీ, అతడు ఆడిన ఇన్నింగ్స్‌తో ముక్కున వేలేసుకున్నారు. ఈ ఒక్క ఉదాహరణ  సూపర్‌ కింగ్స్‌ స్థాయేమిటో చెబుతోంది. పేసర్లు ఇన్‌గిడి, దీపక్‌ చహర్‌ అద్భుతంగా రాణిస్తున్నారు. శార్దుల్‌ ఠాకూర్‌ స్థానంపై అనుమానం ఉన్నా క్వాలిఫయర్‌–1లో తన బ్యాటింగ్‌ జట్టును నిలబెట్టింది. జడేజా ఎలాగూ ఉంటాడు. ఎటొచ్చీ... సీనియర్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ స్థానమే డోలాయమానంలో ఉంది. హైదరాబాద్‌పై అతడికి ఒక్క ఓవర్‌ కూడా ఇవ్వలేదు. బ్యాటింగ్‌లో కీలక సమయంలో బంతులు వృథా చేసి పేలవంగా రనౌటయ్యాడు. మార్పు అవసరం లేదని ధోని భావిస్తేనే భజ్జీకి మరో అవకాశం దక్కుతుంది. కాదంటే  మరో బౌలర్‌ను తీసుకుంటారు. 

ఈ పోరాటం ఆసక్తికరం 
ఇన్‌గిడి * విలియమ్సన్‌ 
చహర్‌ *ధావన్‌    
భువనేశ్వర్‌*రాయుడు 
రషీద్‌  * ధోని, బ్రేవో 

విశ్లేషణ 
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌
కీలకం: కేన్‌ విలియమ్సన్, శిఖర్‌ ధావన్, రషీద్‌ ఖాన్, భువనేశ్వర్‌ కుమార్‌
బలం: కెప్టెన్‌ బ్యాటింగ్, రషీద్, భువీ బౌలింగ్‌ 
బలహీనత: బ్యాటింగ్‌లో తడబాటు 
ప్రత్యేకత: మూడేళ్లలో రెండోసారి ఫైనల్‌ చేరిక
 
చెన్నై సూపర్‌కింగ్స్‌ 
కీలకం: అంబటి రాయుడు, షేన్‌ వాట్సన్, డుప్లెసిస్, బ్రేవో, ధోని 
బలం: ఓపెనర్లు, కెప్టెన్, ఆల్‌రౌండర్లు 
బలహీనత: నాణ్యమైన బౌలింగ్‌కు తలొంచడం 
ప్రత్యేకత: లీగ్‌లో 9 సార్లు పాల్గొని 7 సార్లు ఫైనల్‌ చేరిన జట్టు 
 
లీగ్‌లో ముఖాముఖి రికార్డు 
►రెండు లీగ్‌ మ్యాచ్‌ల్లోనూ విజేత చెన్నైనే. (మొదటి మ్యాచ్‌లో నాలుగు పరుగులతో, రెండో దాంట్లో 8 వికెట్లతో గెలుపు) 
►క్వాలిఫయర్‌ –1లో రెండు వికెట్లతో సూపర్‌కింగ్స్‌ జయభేరి.

తుది జట్లు (అంచనా) 
సన్‌రైజర్స్‌: విలియమ్సన్‌ (కెప్టెన్‌), ధావన్, సాహా, యూసుఫ్‌ పఠాన్, పాండే/హుడా, షకీబ్, బ్రాత్‌వైట్, రషీద్‌ ఖాన్, భువనేశ్వర్, సిద్ధార్ధ్‌ కౌల్, సందీప్‌శర్మ/ఖలీల్‌/థంపి. 
సూపర్‌ కింగ్స్‌: ధోని (కెప్టెన్‌), రాయుడు, వాట్సన్, డు ప్లెసిస్, రైనా, బ్రేవో, జడేజా, హర్భజన్‌/కరణ్‌శర్మ, దీపక్‌ చహర్, ఇన్‌గిడి, శార్దుల్‌. 

మరిన్ని వార్తలు