యోగిపై కామెంట్.. పెద్ద వికెట్ పడింది

25 Mar, 2017 16:10 IST|Sakshi
యోగిపై కామెంట్.. పెద్ద వికెట్ పడింది

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే యోగి ఆదిత్యనాథ్‌ పరిపాలనలో తనదైన మార్క్ చూపిస్తూ, అధికార యంత్రాగాన్ని పరుగులు పెట్టిస్తూ.. ఆ రాష్ట్ర ప్రజలను, మీడియాను ఆకట్టుకుంటున్నారు. మరోవైపు ఆయనపై విమర్శలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. యోగి ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసినందుకు యూపీ కేడర్ ఐపీఎస్ అధికారి హిమంశు కుమార్‌ను శనివారం సస్పెండ్ చేశారు. లక్నోలోని డీజీపీ ఆఫీసుకు ఎటాచ్ చేశారు.

2010 బ్యాచ్‌కు చెందిన హిమంశు ఈ నెల 22న.. యూపీలో యోగి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీనియర్ పోలీసు అధికారులు కిందిస్థాయి అధికారులను, ముఖ్యంగా ఓ కులానికి చెందిన వారిని టార్గెట్ చేస్తున్నారని ట్వీట్ చేశారు. పేరు పక్కన యాదవ్ అని ఉన్నవారిని సస్పెండ్ చేయడం కానీ లూప్ లైన్‌లో పెట్టడం కానీ చేస్తున్నారని విమర్శించారు. ఓ కులానికి చెందిన వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆఫీసు ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు.

ఈ ట్వీట్స్ దుమారం రేపడంతో ఆయన వెంటనే తొలగించారు. కొందరు తన ట్వీట్లను తప్పుగా అర్థం చేసుకున్నారని, ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతు పలికానని వివరణ ఇచ్చారు. హిమంశు చేసిన ట్వీట్స్‌పై ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందిస్తూ.. విచారణకు ఆదేశించారు. తనను సస్పెండ్ చేయడంపై హిమంశు స్పందిస్తూ.. సత్యం మాత్రమే గెలుస్తుందని ట్వీట్ చేశారు. ఆయన గతంలో మణిపురి, ఫిరోజాబాద్ జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం డీజీపీ ఆఫీసుకు బదిలీ చేసింది. కాగా ములాయం సింగ్ యాదవ్ స్థాపించిన సమాజ్‌వాదీ పార్టీకి మద్దతుదారులుగా ఉన్న యాదవ వర్గానికి చెందిన అధికారులను యోగి ప్రభుత్వం పక్కనబెడుతుందనే విమర్శలు వస్తున్నాయి.

మరిన్ని వార్తలు