మళ్లీ విదర్భదే ఇరానీ కప్‌

17 Feb, 2019 00:55 IST|Sakshi

సమష్టిగా రాణించిన బ్యాట్స్‌మెన్‌

రెస్టాఫ్‌ ఇండియాతో మ్యాచ్‌ డ్రా

తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో  విదర్భకు టైటిల్‌

గతేడాది ఇటు రంజీ ట్రోఫీ, అటు ఇరానీ కప్‌ గెలుచుకున్న విదర్భ జట్టు... అదే ప్రదర్శనను మరోసారి నమోదు చేసింది. తద్వారా డబుల్‌ ధమాకా సాధించింది. ఇరానీ కప్‌లో చివరి రోజు శనివారం లక్ష్య ఛేదనలో విదర్భ ఆటగాళ్లు ఆకట్టుకున్నారు. క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్‌ అందరూ రాణించారు. దీంతో... ఊరించే లక్ష్యంతో ఆ జట్టును  పడేయాలనుకున్న రెస్టాఫ్‌ ఇండియా ఆశలు ఆవిరయ్యాయి.

నాగ్‌పూర్‌: ఆంధ్ర క్రికెటర్‌ హనుమ విహారి వీరోచిత సెంచరీలు విదర్భ జోరు ముందు వెలవెలబోయాయి. ఊరించే లక్ష్యానికి అవలీలగా చేరువైన విదర్భ మళ్లీ ఇరానీ విజేతగా నిలిచింది. వరుసగా రంజీ చాంపియన్‌షిప్‌ సాధించినట్లే... ఇరానీ కప్‌నూ చేజిక్కించుకుంది. రెస్టాఫ్‌ ఇండియాతో జరిగిన ఐదు రోజుల మ్యాచ్‌ ‘డ్రా’ అయింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో పాటు గెలుపు వాకిట ఉన్న విదర్భతో ఇక చేసేదేమీ లేక రెస్టాఫ్‌ ఆటగాళ్లు చేతులు కలిపారు. కేవలం 11 పరుగుల దూరంలోనే ఉన్న విదర్భ చేతిలో ఐదు వికెట్లున్నాయి. ఇక విజయం ఖాయం కావడంతో ముందుగానే ఆటను ముగించారు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో ఇరానీ కప్‌ విదర్భ వశమైంది. వసీమ్‌ జాఫర్‌ గాయంతో తప్పుకోవడంతో... చివరి నిమిషంలో విదర్భ తుది జట్టులోకి వచ్చిన అథర్వ తైడే (215 బంతుల్లో 72; 8 ఫోర్లు, 1 సిక్స్‌), గణేశ్‌ సతీశ్‌ (195 బంతుల్లో 87; 9 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలతో రాణించారు. మ్యాచ్‌ ముగిసే సమయానికి విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో 103.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. రాహుల్‌ చహర్‌కు 2 వికెట్లు దక్కాయి. 

వీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 280 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్‌నైట్‌ స్కోరు 37/1తో శనివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన విదర్భ ఏ దశలోనూ తడబడలేదు. 18 ఏళ్ల అథర్వ తొలి సెషన్‌ను నడిపించాడు. సంజయ్‌ రామస్వామి (42; 4 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి రెండో వికెట్‌కు 116 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో అర్ధసెంచరీని పూర్తిచేసుకున్నాడు. తర్వాత గణేశ్‌ సతీశ్‌తో మూడో వికెట్‌కు 30 పరుగులు జోడించాక జట్టు స్కోరు 146 పరుగుల వద్ద అథర్వ మూడో వికెట్‌గా నిష్క్రమించాడు. అనంతరం సతీశ్‌కు మోహిత్‌ కాలే (37; 5 ఫోర్లు) జతయ్యాడు. వీళ్లిద్దరు నాలుగో వికెట్‌కు 83 పరుగులు జోడించడంతో రెస్టాఫ్‌ బౌలర్లకు ఇబ్బందులు తప్పలేదు. 229 పరుగుల వద్ద కాలే నిష్క్రమించగా, 269 పరుగుల వద్ద సతీశ్‌ను విహారి ఔట్‌ చేశాడు. అదేస్కోరు వద్ద మ్యాచ్‌ ముగించేందుకు ఇరు జట్లు అంగీకరించడంతో మ్యాచ్‌ డ్రాగా ప్రకటించారు. అక్షయ్‌ వాడ్కర్‌ (10 నాటౌట్‌) అజేయంగా నిలిచాడు.  
 

మరిన్ని వార్తలు