హాకీలో దుమ్మురేపిన క్రికెటర్‌

7 Aug, 2018 12:55 IST|Sakshi
ఎలినా టైస్‌

13 ఏళ్ల వయసులో క్రికెట్‌లోకి.. 20 ఏళ్లకు హాకీ సిల్వర్‌ మెడలిస్ట్‌

డబ్లిన్‌ : మహిళల హాకీ ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌ మహిళా క్రికెటర్‌ ఎలినా టైస్‌ అదరగొట్టింది. ఫైనల్లో నెదర్లాండ్‌ చేతిలో ఐర్లాండ్‌ ఓడినప్పటికీ ఆ మహిళా క్రికెటర్‌ తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకుంది. ఇటీవల ముగిసిన ఈ టోర్నీలో రజతం సాధించి ఐర్లాండ్‌ చరిత్ర సృష్టించింది. అయితే ఎలినా టైస్‌లా రెండు క్రీడల్లో రాణించే మహిళా క్రికెటర్లు ఉన్నప్పటికి ఆమె ప్రత్యేకం. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ ఎలిస్‌ పెర్రీ క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్‌, న్యూజిలాండ్‌ కెప్టెన్‌ సుజీ బేట్స్‌(బాస్కెట్‌ బాల్‌), ఆల్‌రౌండర్‌ సోఫీ డివిన్‌ (హాకీ)లు తమ దేశం తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

లెగ్‌స్పిన్నర్‌ ‍కమ్‌ బ్యాట్స్‌మన్‌ అయిన ఎలినా మాత్రం వీరందరికీ భిన్నంగా 13 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి మూడో పిన్నవయస్కురాలిగా రికార్డు నమోదు చేసింది. అనూహ్యంగా ఎలీనా డచ్‌పై తన అరంగేట్ర మ్యాచ్‌ ఆడింది. ఇక 18 ఏళ్ల వయసులో ఐర్లాండ్‌ సీనియర్‌ హాకీ జట్టులో చోటు సంపాదించిన ఎలినా.. రెండళ్లకే ప్రపంచకప్‌ టోర్నీలో పాల్గొని రజత పతాక విజేతగా నిలిచింది.

హాంప్‌షైర్‌లో జన్మించిన ఎలినా.. తన నాలుగేళ్ల వయసులోనే వారి కుటుంబం అమెరికాలోని ఇండియానాపొలిస్‌కు వలస వచ్చింది. అక్కడ తొలుత బేస్‌బాల్‌ క్రీడను ఎంచుకుంది. అయితే మరోసారి వారి కుటుంబం అక్కడి నుంచి వియన్నాకు తరలిరావడంతో ఆమె అడుగులు క్రికెట్‌వైపు పడ్డాయి. అనంతరం ఆమె ఆస్ట్రేలియా క్రికెట్‌ క్లబ్‌ తరపున ఆడింది. స్కూల్‌ క్రికెట్‌ ఆడుతున్న తరుణంలో వారి కుటుంబం తిరిగి ఐర్లాండ్‌ చేరింది. సరిగ్గా అప్పుడే ఆమె హాకీని కూడా ఆడటం ప్రారంభించింది.

సోదరులు.. ఆటగాళ్లే..
ఇక ఆమె చిన్నతనంలో క్రికెట్‌, హాకీలు కాకుండా ఫుట్‌బాల్‌, రగ్భీలను ఆడేది. తన కుటుంబంలో చిన్నదైన ఎలినా.. సోదరులు సైతం క్రీడాకారులే కావడం విశేషం. ఒక సోదరుడు వికెట్‌ కీపర్‌ కాగా.. మరొకరు రగ్భీ ఆటగాడు. పిన్న వయసులో అదరగొట్టిన ఎలినా టైస్‌పై ఐర్లాండ్‌ అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రజత పతకంతో తిరిగి వచ్చిన ఐర్లాండ్‌ జట్టుకు ఘనస్వాగతం పలకగా.. రెండు క్రీడల్లో రాణిస్తున్న ఆమెను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. 

చదవండి: భారత మహిళల కల చెదిరె...

మరిన్ని వార్తలు