ఐర్లాండ్‌ టెస్టు అరంగేట్రానికి వేళాయె...

11 May, 2018 01:29 IST|Sakshi

నేటి నుంచి పాకిస్తాన్‌తో మ్యాచ్‌ 

మధ్యాహ్నం గం.3.30 నుంచి  సోనీ సిక్స్‌లో ప్రత్యక్షప్రసారం 

డబ్లిన్‌: ఇప్పుడిప్పుడే టి 20లు, వన్డేల్లో నిలదొక్కుకుంటున్న ఐర్లాండ్‌... టెస్టుల్లోకి అడుగిడుతోంది. శుక్రవారం నుంచి ఆ జట్టు సంప్రదాయ క్రికెట్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) గతేడాది అఫ్గానిస్తాన్, ఐర్లాండ్‌లకు టెస్టు హోదా ఇచ్చింది. దీంతో ఐదు రోజుల ఫార్మాట్‌ ఆడేందుకు అనుమతి దక్కిన 11వ దేశంగా ఐర్లాండ్‌ జట్టు నిలిచింది. డబ్లిన్‌ శివారులోని మాలాహైడ్‌లో జరగనున్న ఈ చరిత్రాత్మక టెస్టులో పసికూనగా బరిలో దిగుతున్న ఐర్లాండ్‌కు... గతంలో పాకిస్తాన్‌కు వన్డేల్లో భారీ షాక్‌ ఇచ్చిన చరిత్ర ఉంది. 2007లో వెస్టిండీస్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో ఆ జట్టు మూడు వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించి సంచలనం సృష్టించింది. ఈ ఓటమి కారణంగా పాకిస్తాన్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. ఈ పరాజయం మరుసటి రోజే అప్పటి పాక్‌ కోచ్‌ బాబ్‌ ఊమర్‌ హోటల్‌ గదిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందడం మరింత కలకలం రేపింది. నాటి ఐర్లాండ్‌ జట్టులోని పలువురు ఆటగాళ్లు... ప్రస్తుత టెస్టు జట్టులోనూ ఉండటం గమనార్హం. చరిత్రాత్మక మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్న కొందరు జట్టు సభ్యులు... తమ భావోద్వేగ ఆనందభాష్పాలను కళ్లద్దాల వెనుక దాచుకుంటామంటూ ప్రకటించారు.  

ఐర్లాండ్‌ టెస్టు జట్టు: విలియమ్‌ పోర్టర్‌ఫీల్డ్‌ (కెప్టెన్‌), ఎడ్‌ జాయ్స్, ఆండీ మెక్‌బ్రైన్, కెవిన్‌ ఒబ్రియెన్, నీల్‌ ఒబ్రియెన్, బాయ్డ్‌ రాన్‌కిన్, స్టిర్లింగ్, గ్యారీ విల్సన్, క్రెయిగ్‌ యంగ్, స్టువర్ట్‌ థాంప్సన్, జేమ్స్‌ షానన్, టిమ్‌ ముర్తాగ్, టైరన్‌ కేన్, ఆండీ బాల్‌బిర్నీ. 

►ఐర్లాండ్‌ పురుషుల జట్టుకంటే ముందుగానే  మహిళల జట్టు టెస్టు అరంగేట్రం చేసింది. 2000 ఆగస్టులో పాకిస్తాన్‌ మహిళల జట్టుతో ఐర్లాండ్‌ జట్టు ఏకైక టెస్టు ఆడింది. రెండు రోజుల్లోనే ముగిసిన ఆ టెస్టులో ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌ 54 పరుగుల తేడాతో గెలిచింది. 

►ఈ మ్యాచ్‌లో బాయ్డ్‌ రాన్‌కిన్‌ బరిలోకి దిగితే రెండు దేశాల తరఫున టెస్టు క్రికెట్‌ ఆడిన 15వ క్రికెటర్‌గా గుర్తింపు పొందుతాడు. 2014లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో రాన్‌కిన్‌ ఇంగ్లండ్‌ తరఫున ఆడాడు. 

మరిన్ని వార్తలు