తొలి ఆటగాడిగా ఇర్ఫాన్‌ పఠాన్‌

17 May, 2019 10:55 IST|Sakshi

జమైకా: ఈ సీజన్‌ కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌)లో భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్‌ పఠాన్‌ ఆడేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. గురువారం ప్రకటించిన సీపీఎల్‌ ఆటగాళ్ల జాబితాలో ఇర్ఫాన్‌ పఠాన్‌ చోటు దక్కించుకున్నాడు. ఈ డ్రాఫ్ట్‌లో చోటు సంపాదించిన తొలి భారత ఆటగాడు ఇర్ఫానే. అయితే ఈ లీగ్‌లో ఆడాలంటే ఇర్ఫాన్‌కు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)నుంచి ఆమోదం లభించాల్సి ఉంది.  దాంతో పాటు సీపీఎల్‌లో ఏదొక ఫ్రాంచైజీ ఇర్ఫాన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే అటు సీపీఎల్‌తో పాటు ఒక విదేశీ టీ20 లీగ్‌లో ఆడిన తొలి భారత ఆటగాడిగా ఇర్ఫాన్‌ గుర్తింపు పొందుతాడు.

గత రెండు ఐపీఎల్‌ సీజన్లలో ఇర్ఫాన్‌ ఆడలేదు. 2017లో గుజరాత్‌ లయన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ ఆల్‌రౌండర్‌.. 2016లో రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌ తరఫున నాలుగు మ్యాచ్‌లు ఆడాడు.  వెస్టిండీస్‌ వేదికగా సెప్టెంబర్‌ 4వ తేదీ నుంచి అక్టోబర్‌ 12వ తేదీ వరకూ సీపీఎల్‌ జరుగనుంది.

మరిన్ని వార్తలు