సచిన్‌, కోహ్లిలతో విభేదించిన ఇర్ఫాన్‌

7 Jan, 2020 16:51 IST|Sakshi
సచిన్‌-ఇర్ఫాన్‌(ఫైల్‌ఫొటో)

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) తెరపైకి తీసుకొచ్చిన నాలుగు రోజుల టెస్టు క్రికెట్‌ ప్రతిపాదనను ఇప్పటికే పలువురు దిగ్గజ క్రికెటర్ల తోసిపుచ్చగా, తాజాగా అందుకు ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఇర్ఫాన్‌ పఠాన్‌ మాత్రం మద్దతు తెలిపాడు. నాలుగు రోజుల టెస్టు క్రికెట్‌ అనేది సరైనది కాదని సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లి, మెక్‌గ్రాత్‌, రికీ పాంటింగ్‌, గౌతం గంభీర్‌ తదితరులు తమ నిర్ణయాన్ని ప్రకటించగా, ఇర్ఫాన్‌ మాత్రం వారితో విభేదించాడు. ఈ క్రమంలోనే రంజీ ట్రోఫీ ప్రస్తావనను తీసుకొచ్చాడు.(ఇక్కడ చదవండి: ఐసీసీ ప్రతిపాదనకు కోహ్లి నో)

రంజీల్లో నాలుగు రోజుల క్రికెట్‌ ఆడుతున్నప్పుడు, టెస్టు క్రికెట్‌లో నాలుగు రోజులు ఎందుకు ఆడకూడదని ప్రశ్నించాడు. ప్రస్తుతానికి దీనిపై ఐసీసీ ముందడుగు వేయకపోయినా రాబోవు సంవత్సరాల్లో నాలుగు రోజుల టెస్టు క్రికెట్‌ను చూస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ‘నాలుగు రోజుల టెస్టు గురించి నేను ఈ రోజు చెబుతున‍్న మాట కాదు.. చాలా ఏళ్లుగా నాలుగు రోజుల టెస్టు ఫార్మాట్‌ గురించి చెబుతూనే ఉన్నాను. దాన్ని చూస్తాననే నమ్మకం నాకు ఉంది. రంజీల్లో నాలుగు రోజుల మ్యాచ్‌లే ఆడి ఫలితాల్ని చూస్తున్నప్పుడు, టెస్టు మ్యాచ్‌ల్లో ఆ విధానాన్ని ఎందుకు పెట్టకూడదు. ఇటీవల కాలంలో మనం మూడు-నాలుగు రోజుల్లోనే టెస్టులు ముగిసిపోతున్నాయి. నాలుగు రోజులు టెస్టు ఫార్మాట్‌ తీసుకొచ్చినా ఎటువంటి ఇబ్బంది రాదు. దీనికి నేను పూర్తి మద్దతు తెలుపుతున్నా’ అని ఇర్ఫాన్‌ అన్నాడు.

మరిన్ని వార్తలు