నేను స్లెడ్జ్‌ చేస్తా.. నువ్వు కేవలం నవ్వు అంతే!

1 Jun, 2020 12:41 IST|Sakshi

ఎక్కువ మాట్లాడకుండా బౌలింగ్‌ చేస్తే మంచిది

‘‘ఎప్పటిలాగే షోయబ్‌ అక్తర్‌ స్లెడ్జింగ్‌ చేస్తున్నాడు. భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు మా దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని తిప్పికొట్టాలనుకున్నా. ఆ క్రమంలోనే అవతలి ఎండ్‌లో ఉన్న ఎంఎస్‌ ధోనితో చర్చించా. నేను స్లెడ్జ్‌ చేస్తాను. నువ్వు అతడిని చూసి కేవలం నవ్వు అని చెప్పా. అందుకు ధోని సరేనన్నాడు. అప్పుడు అక్తర్‌ మరింతగా దూకుడు పెంచాడు. రివర్స్‌ స్వింగ్‌ వేయకుండా తనని కట్టడి చేయడమే మా ప్లాన్‌. తర్వాతి బాల్‌ కూడా ఇంతే ఇంటెన్సిటీతో విసరగలవా అని అక్తర్‌ను రెచ్చగొట్టాను. అప్పుడు అతను.. ‘‘నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. చూడు నిన్ను ఇక్కడి నుంచి పంపించేస్తా’’ అంటూ కోపం ప్రదర్శించాడు. అది నీవల్ల కాదు.. నేను కూడా నిజమైన పఠాన్‌ను. నువ్వు బౌలింగ్‌ చెయ్యి అంతే. ఎక్కువ మాట్లాడకు అన్నాను’’ అంటూ టీమిండియా మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ 2006 నాటి టెస్టు క్రికెట్‌ మ్యాచ్‌ నాటి జ్ఞాప​కాలు గుర్తు చేసుకున్నాడు. ధోనితో కలిసి 210 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి.. భారత్‌ 603 పరుగులు చేయడంలో తన వంతు పాత్ర గురించి చెప్పుకొచ్చాడు.

కాగా 2006లో ఫైసలాబాద్‌లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 588 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఇక ఆనాటి సంగతుల గురించి స్పోర్ట్స్‌ టాక్‌తో మాట్లాడిన ఇర్ఫాన్‌ పఠాన్‌.. అక్తర్‌ స్లెడ్జింగ్‌కు ధీటుగా బదులిచ్చినట్లు పేర్కొన్నాడు. ఐదు వికెట్లు కోల్పోయి భారత్‌ కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన తాను‌... అక్తర్‌ బౌలింగ్‌ ఎదుర్కొన్న విధానం గురించి చెబుతూ... ‘‘నేను బ్యాటింగ్‌కు రాగానే 150-160 కి.మీ వేగంతో అక్తర్‌ పేస్‌ సంధించాడు. ఆ తర్వాత తను బౌన్సర్‌ విసిరాడు. నేను ఎదుర్కొన్నా. ఆ తర్వాత షార్ట్‌ బాల్స్‌ వేశాడు. ఇక అప్పుడు.. పెద్దగా భయపడాల్సిందేమీ లేదు.. నువ్వు బ్యాటింగ్‌ చేయమని ధోని చెప్పాడు. ఇంతలో నేను ధోని దగ్గరికి వెళ్లి అక్తర్‌ వినేలా.. ‘‘పాజీ.. పిచ్‌ తేమగా ఉంది. ఇంతకంటే షార్ట్‌ బంతులు సంధించు అన్నా’’. మళ్లీ అక్తర్‌ ఉడికిపోయాడు. స్పెల్‌ వేశాడు. దాంతో బ్యాటింగ్‌ ఈజీ అయ్యింది. అలా మ్యాచ్‌ను కాపాడుకుని డ్రా చేయగలిగాం’’ అని ఇర్ఫాన్‌ పేర్కొన్నాడు.

>
మరిన్ని వార్తలు