ఇర్ఫాన్‌ పఠాన్‌ వీడ్కోలు

5 Jan, 2020 03:51 IST|Sakshi

అన్ని ఫార్మాట్‌లకు గుడ్‌బై చెప్పిన భారత క్రికెటర్‌

చివరిసారి 2012లో టీమిండియాకు ప్రాతినిధ్యం

భారత్‌ 2007 టి20 ప్రపంచకప్‌ నెగ్గడంలో కీలకపాత్ర

‘మ్యాన్‌ ఆఫ్‌ ద ఫైనల్‌’ అవార్డు సొంతం

ముంబై: ఒకానొక దశలో భారత క్రికెట్‌లో కపిల్‌దేవ్‌ తర్వాత నిఖార్సయిన ఆల్‌రౌండర్‌గా కనిపించిన ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్ని రకాల క్రికెట్‌ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు శనివారం ప్రకటించాడు. 35 ఏళ్ల ఇర్ఫాన్‌ పఠాన్‌ తన కెరీర్‌ ఆరంభంలో ఓ వెలుగు వెలిగాడు. ముఖ్యంగా గ్రెగ్‌ చాపెల్‌ కోచ్‌గా ఉన్న సమయంలో మేటి ఆల్‌రౌండర్‌గా పేరుతెచ్చుకున్న ఈ బరోడా క్రికెటర్‌ ఆ తర్వాత అంచనాలను నిలబెట్టుకోలేకపోయాడు. తొలుత బౌలింగ్‌లో గతి తప్పి... ఆ తర్వాత బ్యాటింగ్‌లో తడబడి... కొన్నాళ్లకు ఫిట్‌నెస్‌ కోల్పోయి... ఆఖరికి జట్టులోనే స్థానం కోల్పోయాడు. 2003లో ఆ్రస్టేలియాపై అడిలైడ్‌ టెస్టులో అరంగేట్రం చేసిన ఇర్ఫాన్‌ ఆ సిరీస్‌లో తన స్వింగ్‌ బౌలింగ్‌తో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. 2012లో తన కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన ఇర్ఫాన్‌... గతేడాది సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 క్రికెట్‌ టోర్నీలో జమ్మూ కాశ్మీర్ తరఫున చివరిసారిగా దేశవాళీ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు.

ప్రస్తుతం ఇర్ఫాన్‌ క్రికెట్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. తన తొమ్మిదేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఇర్ఫాన్‌ కొన్ని చిరస్మరణీయ ప్రదర్శనలు చేశాడు. ముఖ్యంగా 2006 పాకిస్తాన్‌ పర్యటనలో కరాచీ టెస్టులో మ్యాచ్‌ తొలి రోజు తొలి ఓవర్‌లోనే వరుసగా మూడు బంతుల్లో సల్మాన్‌ బట్, యూనిస్‌ ఖాన్, మొహమ్మద్‌ యూసుఫ్‌లను అవుట్‌ చేశాడు. హర్భజన్‌ తర్వాత టెస్టుల్లో హ్యాట్రిక్‌ తీసిన రెండో బౌలర్‌గా ఇర్ఫాన్‌ గుర్తింపు పొందాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టి20 వరల్డ్‌ కప్‌లో భారత్‌ విశ్వవిజేతగా అవతరించడంలో ఇర్ఫాన్‌ కూడా కీలకపాత్ర పోషించాడు. పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో ఇర్ఫాన్‌ 4 ఓవర్లు వేసి 16 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు (షోయబ్‌ మాలిక్, షాహిద్‌ అఫ్రిది, యాసిర్‌ అరాఫత్‌) తీశాడు. ఈ ప్రదర్శనకుగాను ఇర్ఫాన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద ఫైనల్‌’ అవార్డును గెల్చుకున్నాడు.

మరిన్ని వార్తలు