అవుట్‌ సోర్సింగ్‌ నియామకాల్లో అక్రమాలు!

20 May, 2017 01:04 IST|Sakshi
అవుట్‌ సోర్సింగ్‌ నియామకాల్లో అక్రమాలు!

ఇంటర్వ్యూ తర్వాత హోటల్‌లో మళ్లీ దరఖాస్తుల పరిశీలన   

విజయవాడ స్పోర్ట్స్‌: స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌) అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో చేపట్టిన కోచ్‌ల నియామకం మరోసారి రచ్చకెక్కింది. కోచ్‌ పోస్టుల కోసం ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత కూడా విజయవాడలోని ఓ హోటల్‌లో దరఖాస్తులను సెలెక్షన్‌ కమిటీ శుక్రవారం రహస్యంగా మళ్లీ పరిశీలించడం బయట పడింది. వివరాల్లోకెళితే... కోచ్‌ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు ‘శాప్‌’ నియమించిన సెలెక్షన్‌ కమిటీ ఇంటర్వూ్యలు నిర్వహించింది.

నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూ నిర్వహణ అనంతరం ఎంపికైన వారి జాబితాను ‘శాప్‌’ కార్యాలయంలో ఉంచాల్సి ఉంది. అయితే ‘శాప్‌’ ఉన్నతాధికారి, సెలెక్షన్‌ కమిటీ కన్వీనర్‌ దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో కమిటీ రహస్యంగా ఒక హోటల్‌లో దరఖాస్తులను స్క్రూటినీ చేయడం వివాదానికి కారణమైంది. దీనికి తోడు ‘శాప్‌’ వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌. బంగారురాజు, సెలెక్షన్‌ కమిటీలోని మరో సభ్యుడు లేకుండా దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం జరగడం గమనార్హం. సెలెక్షన్‌ కమిటీలో ‘శాప్‌’ వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.బంగారురాజు, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు ఎ.రమణరావు చైర్మన్‌గా, రామిరెడ్డి, వెంకటేశ్వరరావు సభ్యులుగా ‘శాప్‌’ ఉన్నతాధికారి దుర్గాప్రసాద్‌ కన్వీనర్‌గా ఉన్నారు. వాస్తవానికి ఇంటర్వ్యూ ప్రక్రియ మొత్తం ఎండీ పర్యవేక్షణలో ‘శాప్‌’ కార్యాలయంలో జరగాలి. హోటల్‌లో దరఖాస్తులు పరిశీలిస్తున్న గదికి మీడియా వెళ్లడంతో అక్కడున్న వారు అవాక్కయ్యారు.

కొద్దిసేపు ఏం చెప్పాలో వారికి తోచలేదు. పైగా ఇంటర్వూ్య లకు హాజరైన అభ్యర్థులు హోటల్‌లో కనిపించడంతో నియామకాలపై వచ్చిన ఆరోపణలకు బలం చేకూరుతోంది. దీనిపై సెలెక్షన్‌ కమిటీ కన్వీనర్‌ దుర్గాప్రసాద్‌ను వివరణ కోరగా, ఎండీ పర్యవేక్షణలో దరఖాస్తుల పరిశీలన జరుగుతోందన్నారు. ఎండీ బంగారురాజు, సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ భోజనానికి వెళ్లారని, తాను విధి నిర్వహణలో ఉన్నట్లు చెప్పారు. ‘శాప్‌’ కార్యాలయంలో దరఖాస్తుల పరిశీలనకు అనువైన వాతావరణం లేదని, అందుకే హోటల్‌కు వచ్చినట్లు చెప్పడం గమనార్హం. వాస్తవానికి ‘శాప్‌’ వీసీ అండ్‌ ఎండీ బంగారురాజు, కమిటీ చైర్మన్‌ ప్రస్తుతం నగరంలో లేరు. మొత్తం ఎంపిక ప్రక్రియ వివాదాస్పదం కావడంపై ఎండీ కార్యాలయం తరఫు నుంచి ఇంకా ఎలాంటి వివరణా రాలేదు. 

మరిన్ని వార్తలు