తెరపైకి గంగూలీ పేరు!

3 Jan, 2017 19:17 IST|Sakshi

ముంబై: లోధా కమిటీ సిఫారసులను అమలు చేయనందుకు బీసీసీఐ చీఫ్‌ అనురాగ్‌ ఠాకూర్‌పై సుప్రీం కోర్టు వేటు వేయడంతో బోర్డు తదుపరి అధ్యక్షుడు ఎవరు అన్నది చర్చనీయాంశమైంది. ఈ పదవికి టీమిండియా మాజీ కెప్టెన్‌, బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) బాస్‌ సౌరవ్‌ గంగూలీ పేరు వినిపిస్తోంది. క్రికెట్‌ వర్గాల్లో గంగూలీకి చాలామంది మద్దతు ఇస్తున్నారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీయే సరైన వ్యక్తని మాజీ కెప్టెన్‌ సునీల్ గవాస్కర్‌ అన్నాడు.

టీమిండియా కెప్టెన్‌గా గంగూలీ జట్టును విజయవంతంగా నడిపించాడు. ప్రపంచ క్రికెట్లో టీమిండియా అత్యున్నత స్థాయికి చేరేలా కీలక పాత్ర పోషించాడు. మూడేళ్ల క్రితం క్రికెట్‌ రాజకీయాల్లోకి వచ్చిన దాదా క్యాబ్‌ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేశాడు. దీంతో క్రికెటర్‌, పాలనాధ్యక్షుడిగా అనుభవం ఉన్న దాదాకు పగ్గాలు అప్పగిస్తే బీసీసీఐని గాడిలో పెడతాడని భావిస్తున్నారు. 1999-2000లో భారత క్రికెట్‌పై మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు వచ్చాక గంగూలీని కెప్టెన్‌గా నియమించారని, అతను జట్టును గాడిలోపెట్టి విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడని గవాస్కర్‌ చెప్పాడు. కాగా కొన్ని టెలివిజన్‌ కాంట్రాక్టులు ఉన్న గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవి పట్ల ఆసక్తి చూపకపోవచ్చని కొందరు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు