భారత్‌ ‘ఎ’ను గెలిపించిన ఇషాన్‌

1 Sep, 2019 05:00 IST|Sakshi

24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55

దక్షిణాఫ్రికా ‘ఎ’కు రెండో ఓటమి

తిరువనంతపురం: కీలక దశలో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన భారత ‘ఎ’ జట్టు యువ వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ (24 బంతుల్లో 55; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు. శనివారం జరిగిన రెండో అనధికారిక వన్డేలో ఇషాన్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్‌ ‘ఎ’ రెండు వికెట్ల తేడాతో గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. వర్షం కారణంగా 21 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ ‘ఎ’ కెప్టెన్‌ మనీశ్‌ పాండే ఫీల్డింగ్‌ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ‘ఎ’ 21 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. జార్జి లిండే (25 బంతుల్లో 52 నాటౌట్‌; ఫోర్, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో మెరిపించాడు.

కెప్టెన్‌ బవుమా (33 బంతుల్లో 40; 6 ఫోర్లు), క్లాసెన్‌ (27 బంతుల్లో 31; 3 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడారు. భారత్‌ ‘ఎ’ బౌలర్లలో దీపక్‌ చహర్, ఖలీల్‌ అహ్మద్, యజువేంద్ర చహల్, అక్షర్‌ పటేల్‌లకు ఒక్కో వికెట్‌ లభించింది. అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ ‘ఎ’ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి అధిగమించింది. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్‌మెన్‌ దూకుడుగా ఆడటంతో మరో ఓవర్‌ మిగిలి ఉండగానే భారత్‌ ‘ఎ’ లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్‌ కిషన్‌కు జతగా అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌ (19 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కృనాల్‌ పాండ్యా (15 బంతుల్లో 23 నాటౌట్‌; ఫోర్, సిక్స్‌) కూడా బ్యాట్‌ ఝళిపించారు. ఇషాన్‌ కిషన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. సిరీస్‌లోని మూడో వన్డే సోమవారం జరుగుతుంది.  

మరిన్ని వార్తలు