‘టాప్’ లేపిన ఇషాంత్

8 Aug, 2015 00:48 IST|Sakshi
‘టాప్’ లేపిన ఇషాంత్

- తొలి ఇన్నింగ్స్‌లో లంక బోర్డు ప్రెసిడెంట్ 121 ఆలౌట్
- రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లిసేన 112/3
- భారత్‌కు మొత్తం ఆధిక్యం 342 పరుగులు
కొలంబో:
శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించారు. పేసర్ ఇషాంత్ శర్మ (5/23) సంచలన స్పెల్‌కు తోడు ఆరోన్ (2/42), అశ్విన్ (2/8)లు సమయోచితంగా స్పందించడంతో శుక్రవారం రెండో రోజు లంక తొలి ఇన్నింగ్స్‌లో 31 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. డిక్‌వెల్లా (41), సిరివందన (32), గుణతిలక (28) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో 3 వికెట్లకు 112 పరుగులు చేసింది. పుజారా (31 బ్యాటింగ్), లోకేశ్ రాహుల్ (47 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. రోహిత్ (8), కోహ్లి (18), సాహా (1) మరోసారి విఫలమయ్యారు. ఓవరాల్‌గా భారత్ 342 పరుగుల ఆధిక్యంలో ఉంది.
 
తొలి సెషన్‌లోనే ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక బోర్డు ప్రెసిడెంట్ బ్యాట్స్‌మెన్ ఇషాంత్ దెబ్బకు వణికిపోయారు. అద్భుతమైన స్వింగ్‌తో చెలరేగిన ఈ ఢిల్లీ బౌలర్ తన వరుస నాలుగు ఓవర్లలో లంక ‘టాప్’ను కూల్చేశాడు. రెండుసార్లు హ్యాట్రిక్ మిస్ చేసుకున్న ఇషాంత్ కేవలం 5 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. దీంతో లంక 10 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరుకుంది. లంచ్ తర్వాత ఆరోన్, అశ్విన్‌లు చెలరేగిపోయారు. ఓవరాల్‌గా 18వ ఓవర్‌లో 50 పరుగులకు చేరుకున్న లంక ఆ వెంటనే సిరివందన వికెట్‌ను కోల్పోయింది. ఈ  దశలో డిక్‌వెల్లా, గుణతిలక ఎనిమిదో వికెట్‌కు 63 పరుగులు జోడించారు.

అయితే ఏడు పరుగుల తేడాతో చివరి మూడు వికెట్లు పడటంతో ఆతిథ్య జట్టు ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. దీంతో భారత్‌కు 230 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. అంతకుముందు 314/6 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 88.1 ఓవర్లలో 351 పరుగులకు ఆలౌటైంది. రహానే (109; 11 ఫోర్లు, 1 సిక్స్) ఓవర్‌నైట్ స్కోరు వద్దే రిటైర్డ్ అవుట్ కాగా... మిగతా వారు విఫలమయ్యారు. భారత్ ఓవర్‌నైట్ స్కోరుకు మరో 37 పరుగులు జోడించింది.
 
జట్టుతో చేరనున్న రవిశాస్త్రి: భారత జట్టు డెరైక్టర్ రవిశాస్త్రి శనివారం ఉదయం జట్టుతో చేరనున్నారు. యాషెస్ సిరీస్‌లో టీవీ విశ్లేషకుడిగా పని చేసేందుకు ఇంగ్లండ్ వెళ్లిన ఆయన... జింబాబ్వేలో భారత పర్యటనకు కూడా అందుబాటులో లేరు. అయితే మరో యాషెస్ టెస్టు మిగిలుండగానే శ్రీలంక వచ్చి జట్టుతో చేరుతున్నారు.
 
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 88.1 ఓవర్లలో 351 ఆలౌట్.
శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: డిసిల్వా (బి) ఇషాంత్ 0; జేకే సిల్వా ఎల్బీడబ్ల్యు (బి) ఇషాంత్ 0; తిరిమన్నే (సి) రాహుల్ (బి) ఇషాంత్ 5; తరంగ ఎల్బీడబ్ల్యు (బి) ఇషాంత్ 0; సిరివందన (సి) సాహా (బి) ఆరోన్ 32; కుశాల్ పెరీరా (బి) ఇషాంత్ 0; జయసూరియా (సి) సా హా (బి) ఆరోన్ 7; డిక్‌వెల్లా (బి) అశ్విన్ 41; గుణతిలక (సి) ఉమేశ్ (బి) అశ్విన్ 28; గమాగే ఎల్బీడబ్ల్యు (బి) హర్భజన్ 2; కాసన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (31 ఓవర్లలో ఆలౌట్) 121.
 
వికెట్ల పతనం: 1-0; 2-1; 3-1; 4-10; 5-10; 6-38; 7-51; 8-114; 9-117; 10-121. బౌలింగ్: భువనేశ్వర్ 7-3-17-0; ఇషాంత్ 7-1-23-5; ఉమేశ్ 6-1-24-0; ఆరోన్ 6-0-42-2; అశ్విన్ 3-1-8-2; హర్భజన్ 2-0-7-1.
 
భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ ఎల్బీడబ్ల్యు (బి) ఫెర్నాండో 8; కోహ్లి (సి) పతిరన (బి) కాసన్ రజిత 18; సాహా ఎల్బీడబ్ల్యు (బి) ఫెర్నాండో 1; పుజారా బ్యాటింగ్ 31; రాహుల్ బ్యాటింగ్ 47; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (40 ఓవర్లలో 3 వికెట్లకు) 112.
 
వికెట్ల పతనం: 1-22; 2-27; 3-28.
బౌలింగ్: ఫెర్నాండో 5-0-17-2; లాహిర్ గమాగే 7-0-15-0; కాసన్ రజిత 7-2-16-1; గమాగే 3-2-7-0; పతిరన 10-1-31-0; జయసూరియా 8-0-25-0.

>
మరిన్ని వార్తలు