‘మూడు’లో నిలవడానికి మూడు వికెట్లు!

27 Feb, 2020 16:23 IST|Sakshi

క్రిస్ట్‌చర్చ్‌: టీమిండియా పేసర్‌ ఇషాంత్‌ శర్మ ‘ట్రిపుల్‌ సెంచరీ’ క్లబ్‌లో చేరడానికి చేరువగా ఉన్నాడు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో ఐదు వికెట్లతో ఆకట్టుకున్న ఇషాంత్‌.. తన టెస్టు కెరీర్‌లో ఇప్పటివరకూ 297 వికెట్లను సాధించాడు. మరొకవైపు టెస్టు కెరీర్‌లో ఐదు వికెట్లను 11వ సారి సాధించాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన రెండో భారత పేసర్‌గా జహీర్‌ సరసన ఇషాంత్‌ చేరాడు. జహీర్‌ 92 టెస్టుల్లో 11 సార్లు ఐదు వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్‌ 97 టెస్టుల్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో కపిల్‌ దేవ్‌(23) అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక విదేశీ గడ్డపై ఎక్కువ సార్లు ఐదు వికెట్లు(9) పడగొట్టిన మూడో టీమిండియా బౌలర్‌గా లంబూ నిలిచాడు. (ఇక‍్కడ చదవండి: జహీర్‌ ఖాన్‌ సరసన ఇషాంత్‌)

కాగా, ఇప్పుడు మూడొందల టెస్టు వికెట్ల క్లబ్‌లో చేరడానికి ఇషాంత్‌ స్వల్ప దూరంలో నిలిచాడు.  శనివారం నుంచి క్రిస్ట్‌చర్చ్‌ వేదికగా జరుగనున్న రెండో టెస్టులో ఇషాంత్‌ ఈ ఫీట్‌ సాధించే అవకాశం ఉంది. ఈ అరుదైన మైలురాయికి మూడు వికెట్ల దూరంలో మాత్రమే ఇషాంత్‌ ఉన్నాడు. ఇప్పటివరకూ భారత్‌ తరఫున ఐదుగురు మాత్రమే మూడొందల టెస్టు వికెట్ల క్లబ్‌లో చేరారు. అనిల్‌ కుంబ్లే(619), కపిల్‌దేవ్‌(434), హర్భజన్‌ సింగ్‌(417), అశ్విన్‌(365), జహీర్‌ఖాన్‌(311)లు మాత్రమే మూడొందల వికెట్లను సాధించిన భారత బౌలర్లు. వీరిలో కపిల్‌దేవ్‌, జహీర్‌ఖాన్‌లు పేసర్లు కాగా, మిగతా ముగ్గురు స్పిన్నర్లు. 

అత్యధిక టెస్టులు రికార్డు కూడా ఇషాంత్‌దే..!
మూడొందల టెస్టు వికెట్లు సాధించే క్రమంలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఘనత న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ డానియల్‌ వెటోరి పేరిట ఉంది. వెటోరి 94వ టెస్టులో 300 వికెట్ల మార్కును చేరుకున్నాడు. దీన్ని ఇషాంత్‌ బ్రేక్‌ చేయనున్నాడు. న్యూజిలాండ్‌తో రెండో టెస్టు ఇషాంత్‌కు 98వ మ్యాచ్‌ కానుంది. దాంతో వెటోరీ 94 టెస్టుల రికార్డును ఇషాంత్‌ బద్ధలు కొట్టనున్నాడు.

 2018 నుంచి రెగ్యులర్‌ మెంబర్‌గా...
భారత జట్టులో  రెగ్యులర్‌ మెంబర్‌గా మారడానికి ఇషాంత్‌కు మంచి బ్రేక్‌ వచ్చింది మాత్రం 2018లోనే. ఆ ఏడాది నుంచి ఇషాంత్‌ శర్మ భారత టెస్టు జట్టులో రెగ్యులర్‌ సభ్యుడిగా మారిపోయాడు.  2018 నుంచి ఇప్పటివరకూ ఇషాంత్‌ శర్మ 71 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే 19.14 యావరేజ్‌ సాధించాడు. ఫలితంగా కనీసం 50 వికెట్లు సాధించిన పేసర్ల యావరేజ్‌ జాబితాలో ఇషాంత్‌ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు.

>
మరిన్ని వార్తలు